తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం జిల్లా (సత్తుపల్లి) : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. పారిశ్రామికాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కులు ఇప్పుడు బడా బాబులకు, అధికార పార్టీ పెద్దలకు అక్రమ సంపాదన కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని ‘బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్’ కేంద్రంగా జరిగిన భూ కుంబకోణం స్థానికంగా పెను సంచలనంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి, ఏకంగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం సైతం లేకుండానే కోట్లాది రూపాయల విలువైన భూములను ఓ ప్రైవేట్ కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది…..
ఎకరం రూ.75 లక్షల విలువైన భూమి.. ఎకరం రూ.20 లక్షలకే….
బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌లో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం “దీపక్ నెక్సట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్” అనే కంపెనీకి టీజీఐఐసీ (TGIIC) భారీగా భూములను కేటాయించింది. అయితే ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.75 లక్షలకు పైగా పలుకుతుండగా, కనీస ప్రభుత్వ ధర (TGIIC వాల్యుయేషన్) రూ. 44.4 లక్షలుగా నిర్ణయించారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ భూములను సదరు కంపెనీకి కేవలం రూ.20 లక్షలకే కట్టబెట్టారు. ఈ నిర్ణయం వెనుక కోట్ల రూపాయల చేతులు మారినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇలాంటి భారీ కేటాయింపులు, ధర తగ్గింపులు చేసేటప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర మంత్రివర్గ (క్యాబినెట్) ఆమోదం పొందాలి. కానీ అవేవీ లేకుండానే ఏకపక్షంగా భూములను అప్పగించడం ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు…..
టీజీఐఐసీ అధికారుల పొంతనలేని సమాధానాలు….
ఈ వ్యవహారంపై టీజీఐఐసీ జోనల్ మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఇంచార్జి ఇస్తున్న వివరణ పలు అనుమానాలకు తావిస్తోంది. “ఎకరం రూ.40.47 లక్షలుగా ధర నిర్ణయించడం వల్ల ఏ కంపెనీలూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని,బిల్డింగులు పాడవుతున్నాయని అందుకే ఎకరం రూ.21 లక్షల చొప్పున అప్పగించాల్సి వచ్చిందని” అధికారులు చెబుతున్నారు. అయితే, క్యాబినెట్ ఆమోదం లేకుండా అంత భారీ పెంపు/తగ్గింపు నిర్ణయాలు తీసుకునే అధికారం అధికారులకు ఎక్కడిది? అన్నది స్థానికులు వేస్తున్న సూటి ప్రశ్న….
లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి స్వాహా.. నిద్రమత్తులో మైనింగ్ శాఖ….
ఇది కేవలం భూముల కుంభకోణం మాత్రమే కాదు, సహజ వనరుల దోపిడీ కూడా! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా సదరు ఫుడ్ పార్క్ ప్రాంతానికి తరలిస్తున్నారు. వందలాది ట్రిప్పర్లతో రేయంబవళ్లు ఈ మట్టి దందా యథేచ్ఛగా సాగుతున్నా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.అసలు మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయా?
ఉంటే ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారు?
క్షేత్రస్థాయిలో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు తరలిస్తున్నారు?అన్న కనీస పర్యవేక్షణ కూడా లేదు. ఈ మట్టి దందా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం….
ప్రతిపక్షాల మౌనం.. అనుమానాలకు ఆస్కారం….
ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలమైన మీడియా నోరు విప్పకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు, పేదలకు 75 గజాల ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు పట్టి వీధి పోరాటాలు, ధర్నాలు చేసే వామపక్షాలు (కమ్యూనిస్టు పార్టీలు).. వందల ఎకరాల ప్రభుత్వ భూమి, కోట్లాది రూపాయల సహజ సంపద బడా బాబుల పాలవుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ “మౌన వ్రతం” వెనుక ఏదైనా పెద్ద ఒప్పందం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నత స్థాయి విచారణ జరపాలి…..
సామాన్యుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే పదుల సంఖ్యలో అనుమతులు అడిగే అధికారులు, బడా కార్పొరేట్లకు మాత్రం నిబంధనలు సడలించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణమే ఈ భూ కేటాయింపులను రద్దు చేసి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని స్థానిక ప్రజలు, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దోచుకున్న మట్టికి సీనరేజ్ వసూలు చేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
