తెలంగాణా /ఖమ్మం జిల్లా :
ఖమ్మం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల, మతతత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో ‘జైల్ భరో’ కార్యక్రమం విజయవంతమైంది. అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో భారీ ఆందోళన చేపట్టారు. పరిషత్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేయగా, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అరెస్టులు అయ్యారు. అనంతరం జరిగిన సభలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం దుందుడుకుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద సంస్కరణలతో దేశంలోని కార్మిక, కర్షక రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు….

కార్మిక హక్కులకు కేంద్రం పాతర…
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేందుకు ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్‌లను తీసుకురావడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. పనివేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం, సమ్మె హక్కును కాలరాయడం దారుణమన్నారు. 300 మంది లోపు ఉద్యోగులున్న కంపెనీల్లో యాజమాన్యాలు ఎప్పుడైనా ఉద్యోగులను తొలగించేలా “హైర్ అండ్ ఫైర్” విధానాన్ని తీసుకురావడం ద్వారా కార్మికుల ఉద్యోగ భద్రతను గాలికి వదిలేశారని విమర్శించారు. లేబర్ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) వల్ల స్థానిక రైతులు దివాళా తీస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి జీరో సుంకంతో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతుండటంతో దేశీయ ఉత్పత్తులకు ధర లేకుండా పోయిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వెంటనే ఎంఎస్పీ చట్టం చేయాలని, రుణ విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించి, దానిని “వికసిత్ భారత్ గ్రామ్ జీ (విబీ గ్రామ)” గా మార్చడమే కాకుండా, అందులో రాష్ట్రాల వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే, అంత్యోదయ అన్న యోజన పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఇస్తున్న 35 కిలోల బియ్యాన్ని రద్దు చేసి, మనిషికి 7 కిలోల చొప్పున మాత్రమే ఇచ్చేలా ఆహార భద్రతా చట్టానికి చేస్తున్న సవరణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదే విధంగా పార్లమెంటు ఆమోదించిన “2025 విద్యుత్ సవరణ బిల్లు” ద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని నాయకులు ఆరోపించారు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అంతా కేంద్రమే చూసుకునేలా, స్మార్ట్ మీటర్లు పెట్టి ముందుగానే చార్జీలు వసూలు చేసేలా ఈ చట్టం ఉందన్నారు. క్రాస్ సబ్సిడీని రద్దు చేయడం వల్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే ప్రమాదం ఉందన్నారు…రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘రైతు డిస్కం’ పై కూడా నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. సరైన బడ్జెట్ కేటాయింపులు లేకుండా దీనిని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం లేదా చార్జీలు వసూలు చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది క్రమేపీ విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు దారితీస్తుందని హెచ్చరించారు….

భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలి…
ఈ కార్యక్రమంలో సీపీఎం రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణువర్ధన్, సి.వై.పుల్లయ్య, జి.రామయ్య, సింగు నరసింహారావు, తోట రామాంజనేయులు, యర్రా శ్రీనివాస్, మెరుగు సత్యనారాయణ, బోంతు రాంబాబు, మాదినేని రమేష్, వై.విక్రమ్, గోవిందరావు, వెంకన్న, నరాల నరేష్, ఆవుల అశోక్, బీఆర్టీయూ నాయకులు పాషా, దండ జ్యోతి రెడ్డి, తొట్టి కొమరయ్య, రాంబాబు, లక్ష్మీనారాయణలతో పాటు మహిళా సంఘాల నాయకులు శిరోమణి, బండి పద్మ, పి.రమ్య, షకీనా, మోటే కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట 9703973456
