పిండిప్రోలు వృద్ధురాలి హత్య కేసు చేదించిన పోలీసులు,ఇద్దరు నిందితుల అరెస్ట్…

Pathi Sreenivas Rao
2 Min Read

తిరుమలాయపాలెం(నేర వార్తలు): ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య మరియు దోపిడీ కేతను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణ హత్య జరిగినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్ అదే గ్రామంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించడం మరియు ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడే అలవాటు ఉండటంతో భారీగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. తన చికెన్ షాప్ సమీపంలోనే నివసిస్తున్న వృద్ధ దంపతులపై నిఘా పెట్టిన ప్రశాంత్.. వృద్ధురాలు సుగుణ మెడలో ఎప్పుడూ బంగారు ఆభరణాలు ఉండటాన్ని గమనించాడు. ఎలాగైనా వాటిని దోచుకోవాలని పథకం పన్నాడు….

జులై 17 అర్ధరాత్రి సమయంలో సుగుణ ఇంటికి ప్రశాంత్ వెళ్లాడు.ఆమె ధరించిన బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయగా వృద్ధురాలు గట్టిగా ప్రతిఘటించింది.దీంతో భయపడిపోయిన నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆమెపై తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు.అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు చైన్, నల్లపూసల చైన్‌కు సంబంధించిన బంగారు బిళ్లలను (ఏసులు) దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న కూసుమంచి సర్కిల్ పోలీసులు కూపీ లాగారు. కూసుమంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజీవ్ ఆధ్వర్యంలో… ఎస్సై దివ్య మరియు సిబ్బందితో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం తిరుమలాయపాలెం రోడ్డులో ప్రధాన నిందితుడు ఐతనబోయిన ప్రశాంత్ (26) తో పాటు, అతనికి సహకరించిన మరో నిందితుడు మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం బాలినిధర్మారానికి చెందిన సరగండ్ల మహేష్ (20) లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు….

హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్.. దోచుకున్న బంగారు చైన్‌ను తన వరుసకు బామ్మర్ది అయిన సరగండ్ల మహేష్‌కు ఇచ్చాడు. ఆ బంగారాన్ని ఖమ్మంలోని ఒక బ్యాంకులో తన పేరుతో తాకట్టు పెట్టి రూ. 1,50,000/- రుణం పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.నిందితుల నుంచి,తొమ్మిది బంగారు బిళ్లలు,బ్యాంకుకు సంబంధించిన గోల్డ్ లోన్ పత్రం,రెండు మొబైల్ ఫోన్లు,నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్,ద్విచక్ర వాహనం స్వాదినం చేసుకున్నారు….ఈ కేసును త్వరితగతిన చేధించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సంజీవ్, ఎస్సై దివ్య, మరియు సిబ్బంది K. జగదీష్, P. సంతోష్, J. నాగరాజు, హరికృష్ణలతో పాటు పోలీస్ సిబ్బంది పూర్ణ చందర్ రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీనులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు….

📄 Generate e-Paper Clip
Share This Article