తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ కుంభకోణం: ఒకే ఆధార్.. రెండు పేర్లు.. రెండు ఉద్యోగాలు…

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీవినీ ఎరుగని భారీ కుంభకోణం వెలుగుచూసింది. అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి, రెండు వేర్వేరు పేర్లతో ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రతి నెలా లక్షల రూపాయల జీతాలు స్వాహా చేస్తున్న వైనం తాజాగా బట్టబయలైంది.ఆర్థిక శాఖ చేపట్టిన తనిఖీల్లో వెలుగుచూసిన ఈ నకిలీ ఉద్యోగుల బాగోతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ కార్డు వివరాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్న క్రమంలో ఈ కుంభకోణం బయటపడింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య, విద్యా తదితర కీలక శాఖల్లో దాదాపు 40 అనుమానాస్పద కేసులను అధికారులు గుర్తించారు. ఈ 40 ఆధార్ నంబర్లపై ఏకంగా 80 మంది డూప్లికేట్ ఉద్యోగులు చెలామణి అవుతున్నట్లు నిర్ధారించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నకిలీ బాగోతానికి పాల్పడిన వారంతా ‘రెగ్యులర్ ఉద్యోగులు’ కావడం గమనార్హం.

వీరు సృష్టించిన నకిలీ రికార్డులు చూసి ఉన్నతాధికారులు సైతం విస్తుపోతున్నారు.ఒకే ఆధార్ నంబర్‌తో ఒక శాఖలో పురుషుడిగా నమోదైన ఉద్యోగి, మరో శాఖలో మహిళ పేరుతో ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటున్నాడు.మరో కేసులో, ఒకే ఆధార్‌పై ఒక శాఖలో ఒక మతం పేరుతో రికార్డులు సృష్టించిన అక్రమార్కుడు, మరో శాఖలో వేరొక మతం పేరుతో ఉద్యోగిగా చలామణి అవుతున్నాడు.వివిధ శాఖల్లో ఒకే ఆధార్ నంబర్‌తో రెండు ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను ఆర్థిక శాఖ ఇలా గుర్తించింది,డి.ప్రమీల రాణి, కె.ప్రమీల పేరుతో ఒకే ఆధార్ నంబర్‌పై ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా రెండు ఉద్యోగాలు.కిందింటి మోహన్ రెడ్డి, బసిరెడ్డి మోహన్ రెడ్డి పేర్లతో ఒకే ఆధార్‌పై రెండు కొలువులు,డి.లావణ్య, రమాదేవి పేరిట ఒకే ఆధార్ నంబర్‌పై రెండు జీతాలు.రెవెన్యూ శాఖలో ‘అన్నపూర్ణ’గా, డీజీపీ కార్యాలయంలోనూ అదే ‘అన్నపూర్ణ’ పేరుతో వేర్వేరు ఉద్యోగులుగా రికార్డుల సృష్టి.సంతోష్ కుమార్ నీలకంఠ, బీర సతీష్ రెడ్డిల పేరిట ఒకే ఆధార్ నంబర్‌తో రెండు ఉద్యోగాలు. అదే శాఖలో చిలుకూరి సుదర్శన్, పలస ముత్యాలు పేరిట మరో డూప్లికేట్ జంట గుర్తించినట్లు సమాచారం…

నకిలీ పత్రాలతో ఏళ్ల తరబడి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న ఈ డూప్లికేట్ ఉద్యోగులు.. కేవలం మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే ఒక్కొక్కరు దాదాపు రూ. 5 లక్షల చొప్పున జీతం అందుకున్నట్లు ఆర్థిక శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేస్తూ విధులకు ఎలా హాజరవుతున్నాడు? ఏళ్ల తరబడి డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ అధికారులు (DDO) ఈ తతంగాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ దర్యాప్తులో ఇంకెన్ని సంచలనాత్మక విషయాలు, ఇంకెంత మంది డూప్లికేట్ ఉద్యోగులు బయటపడతారోనని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది….

📄 Generate e-Paper Clip
Share This Article