“ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ “లో ముదిరిన వర్గపోరు…అధ్యక్షుడిపై కార్యదర్శి,కోశాధికారి ఏకపక్ష పోరు…

Pathi Sreenivas Rao
3 Min Read

ఖమ్మం: ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత ఎన్నికల సమయంలో వేర్వేరు ప్యానెళ్ల నుంచి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఎన్నిక కావడంతోనే ఈ ఆధిపత్య పోరుకు బీజం పడిందని వ్యాపార వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. సహజంగా వ్యాపారస్తుల్లో ఛాంబర్ ఎన్నికల వరకే పోటీలు నెలకొని ఉంటాయి. కానీ దానికి భిన్నంగా, ఇక్కడ అధ్యక్షునికి వ్యతిరేకంగా కార్యదర్శి, కోశాధికారి ఏకమై ‘డీ అంటే డీ’ అంటున్న వైనం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది….

గత రెండు రోజుల క్రితం జరిగిన ఛాంబర్ మీటింగులో ఈ వర్గ విభేదాలు కాస్తా “నువ్వెంత అంటే నువ్వెంత” అనే స్థాయికి చేరాయి. మార్కెట్లో జరుగుతున్న ‘ఆర్డీ, జీరో దందాల’ మీద వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ… “మీ వ్యక్తిగత గొడవల వలన మార్కెట్ కు చెడ్డ పేరు వస్తోంది” అని ఛాంబర్ అధ్యక్షుడు కోశాధికారిని నిలదీశారు. అయితే, కోశాధికారిని వెనకేసుకొచ్చిన కార్యదర్శి కలుగజేసుకోవడంతో… అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, గొడవ జరిగినట్లు సమాచారం….వీరి మధ్య నెలకొని ఉన్న
ఈ వర్గపోరు కారణంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎన్నికైన పాలకవర్గం ఇప్పటివరకు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయని దయనీయ పరిస్థితి నెలకొంది. ఛాంబర్ ఎన్నికలు జరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా… ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షుణ్ణి నియమించుకోలేని దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా నామినేటెడ్ ఈసీ లను కూడా భర్తీ చేసుకోలేని పరిస్థితిలో పాలకవర్గం కొట్టుమిట్టాడుతోంది….

ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షునిగా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడు ప్రతిపాదించగా… తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోననే ఉద్దేశంతో కార్యదర్శి, కోశాధికారి ఆ ప్రతిపాదనను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.ఈ వర్గపోరుతో పాటు అగ్నికి ఆజ్యం పోసినట్లు, ఎన్నడూ లేని విధంగా ఛాంబర్ లో రాజకీయాలు ప్రవేశించడంతో దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కోశాధికారి రాజకీయ వేదికగా తయారు చేశాడంటూ వ్యాపార వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వీరి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా సగటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం…

ఛాంబర్ లో నెలకొన్న ఈ వర్గ విభేదాల నేపథ్యంలో అధ్యక్షునికి కార్యదర్శి, కోశాధికారితో పాటు వ్యవసాయ మార్కెట్ సెక్రెటరీ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా ఆయన తన హక్కులను వినియోగించుకోకుండా, కనీస విధులు నిర్వర్తించకుండా కార్యదర్శి, కోశాధికారి పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా, ఛాంబర్ కార్యదర్శి, కోశాధికారి మరియు వ్యవసాయ మార్కెట్ సెక్రెటరీకి మధ్య ఉన్న వ్యక్తిగత వ్యాపార భాగస్వామ్యాల వలనే వారందరూ ఏకమై… ఛాంబర్ అధ్యక్షుణ్ణి ఉద్దేశపూర్వకంగా ఒంటరి వాడిని చేసే ప్రయత్నం జరుగుతోందని మార్కెట్ వర్గాల్లో బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే ఈ ఆధిపత్య పోరుకు తెరదించి ఛాంబర్ పూర్వ వైభవాన్ని కాపాడాలని వ్యాపారులు కోరుతున్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article