తెలంగాణ /హైదరాబాద్:
హైదరాబాద్ సిటీ: అత్యంత రద్దీగా ఉండే మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదుట ఆగస్టు 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డు దాటుతున్న లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26)ని అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఈ కేసులో నిందితుడైన జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్‌ను రక్షించేందుకు మాదాపూర్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి…
కేసును నీరుగార్చేందుకు యత్నాలు?
“నా కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తా” అంటూ నిందితుడి తండ్రి పోలీసులకు భారీ ఆఫర్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. స్టేషన్ ఉన్నతాధికారి మరియు లింగమనేని కుటుంబం ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతోనే కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తీవ్రమైన ప్రమాదాలకు సంబంధించి BNS 105 అంటే హత్యతో దానికి సమానం మైన నేరపూరిత మానవభంగం కేసు,మరియు మోటార్ వాహన చట్టం 184 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, పోలీసులు మాత్రం స్టేషన్ బెయిల్ లభించే BNS 106(1) కింద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపించివేశారు…..
డ్రైవర్ మార్పు కుట్ర?
ప్రమాదం జరిగిన వెంటనే సంజుష్ స్థానంలో ఒక ప్రైవేట్ డ్రైవర్‌ను నిందితుడిగా చూపి కేసు ముగించాలని చూసినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన 5 రోజుల వరకు ఈ వివరాలను బయటకు రాకుండా గోప్యంగా ఉంచడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.కానీ వీడియోలు బయటకు రావడంతో కలకలం మొదలయ్యింది ,ప్రమాద సమయంలో స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దిద్దుబాటు చర్యల్లో భాగంగా పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో మీడియాకు సమాచారం లీక్ చేశారు…..
సాక్ష్యాల మాయంపై ప్రజల ఆగ్రహం…
రవాణా శాఖ అధికారుల ప్రాథమిక పరిశీలన ప్రకారం ప్రమాద సమయంలో కారు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు లేవని, అందుకే పూర్తి వివరాలు వెల్లడించలేకపోతున్నామని రవాణా శాఖ అధికారులు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ కారిడార్‌లో నిత్యం వేలాది వాహనాలు తిరిగే అంతటి కీలక ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం ఏంటని, ఉన్నతాధికారులను కాపాడేందుకే కెమెరా ఫుటేజీని మాయం చేశారా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రక్త నమూనాల నివేదిక వచ్చాకే కొత్త సెక్షన్లు జోడిస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ, మొదటి నుంచీ డీల్ కుదుర్చుకుని కేసును పక్కదోవ పట్టిస్తున్నారన్న సందేహాలను న్యాయనిపుణులు సైతం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ కేసుపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
