పెసర పంట కోయనివ్వకుండా అడ్డుకుంటున్నారు..కాంగ్రెస్ నాయకులపై వృద్ధురాలి తీవ్ర ఆరోపణలు…

Pathi Sreenivas Rao
2 Min Read

చింతకాని, ఆగస్టు 30: తమ వ్యవసాయ భూమిలో పండించిన పెసర పంటను కోయించేందుకు వెళ్లిన హార్వెస్టర్‌ను కొందరు స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పాతర్లపాడు గ్రామానికి చెందిన గుగ్గిళ్ల భారతమ్మ ఆరోపించారు. గత మూడు రోజులుగా పంట కోత పనులు నిలిచిపోయాయని, తమ వ్యవసాయ భూమికి రాకపోకలను సైతం అడ్డుకుంటూ మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.భారతమ్మ విడుదల చేసిన వీడియోలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారులకు చెందిన వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చామని, ప్రస్తుతం ఆ భూమిలో పెసర పంట సాగులో ఉందన్నారు. పంట కోత కోసం హార్వెస్టర్‌ను పొలానికి తీసుకెళ్లగా, కొందరు వ్యక్తులు అడ్డుకుని హార్వెస్టర్‌ను ముందుకు వెళ్లనీయకుండా చేశారని పేర్కొన్నారు..పాతర్లపాడు గ్రామం నుంచి రేపల్లెవాడకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న తమ వ్యవసాయ భూమికి వెళ్లే రాకపోకలను కూడా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన తారు రోడ్డుపై రాకపోకలకు ఆటంకాలు కలిగిస్తూ పంట కోతను అడ్డుకుంటున్నారని తెలిపారు….

స్థానిక కాంగ్రెస్ నాయకులు బొర్రా ప్రసాద్, కాండ్ర పిచ్చయ్య, బొర్రా శేషగిరి, తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సత్యం, సామినేని శ్రీను తదితరులు తమను బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నారని భారతమ్మ ఆరోపించారు. తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తామని, తమ అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా, తమ వెనుక పోలీసుల అండదండలు ఉన్నాయని, భట్టి విక్రమార్క అండ తమకు ఉందంటూ కొందరు బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నాయకుల స్పందన తెలియాల్సి ఉంది….

పాతర్లపాడు గ్రామంలో గతంలోనూ హత్యలు, అరాచక ఘటనలు చోటుచేసుకున్నాయని, ప్రస్తుత పరిస్థితులు తమ కుటుంబంలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయని భారతమ్మ అన్నారు. పంటను కోయించుకునే విషయంలో తమపై ఒత్తిడి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
తమకు పోలీసుల నుంచి తక్షణ రక్షణ కల్పించాలని భారతమ్మ అధికారులను కోరారు. వ్యవసాయ భూమికి వెళ్లే మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, పంట కోతకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు…“మాకు పోలీసు రక్షణ కల్పించకపోతే ప్రాణాలు కోల్పోవడం తప్ప మరో మార్గం లేదనే పరిస్థితి ఏర్పడింది” అంటూ భారతమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై పోలీసులు వెంటనే స్పందించి, ఇరువర్గాల వాదనలు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యవసాయ భూమికి రాకపోకలు, పంట కోత విషయంలో తలెత్తిన వివాదానికి చట్టపరమైన పరిష్కారం చూపాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది…..

📄 Generate e-Paper Clip
Share This Article