తెలంగాణ/హైదరాబాద్
హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న కొండా సురేఖ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి కొండా సురేఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది….
రచ్చ మధ్య రాఖీ.. రాజకీయంగా ఆసక్తికర పరిణామం..
కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డి, కొండా సురేఖ కుటుంబం మధ్య రాజకీయ విభేదాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణలోని మహిళల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆశీర్వాదం ఉంటుందని తెలిపారు.“నన్ను సపరేట్ చేయకండి” అంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలోనూ తాను రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని ఆమె తెలిపారు. ఈ భేటీతో ఇరువర్గాల మధ్య దూరం తగ్గిందా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది….
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా పరకాల అసెంబ్లీ సీటు అంశానికి సంబంధించిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సుమారు 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కొంతమంది కాంగ్రెస్ నేతలు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలతో సురేఖ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి….
క్రమశిక్షణ కమిటీ నివేదిక.. ఏఐసీసీ నిర్ణయం?
వివాదం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారం కీలక దశకు చేరింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సురేఖ వ్యవహారంపై నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు సమర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. తుది నిర్ణయం ఏఐసీసీ పరిధిలో ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో కేబినెట్ ప్రక్షాళనపై కూడా చర్చ జరుగుతోంది. మంత్రి వర్గంలో మార్పులు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో సురేఖ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు….
రేవంత్‌కు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలకు షాకేనా?
వివాదం తీవ్రంగా ఉన్న సమయంలో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా సీఎం నివాసంలో ఆమెను కలిసిన సందర్భంలో అసౌకర్యానికి గురైనట్లు కూడా రిపోర్టులు వెలువడ్డాయి. కొందరు ఎమ్మెల్యేలు ఆమెకు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తుంది,ఇదే ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమైంది.ఒకవైపు సురేఖపై చర్యలు కోరిన నేతలు.. మరోవైపు అదే సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం..ఈ పరిణామం కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచింది….
రాఖీతో వివాదానికి ఫుల్స్టాప్ పడినట్టేనా?
రాఖీ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఈ భేటీని కొందరు కాంగ్రెస్ వర్గాలు సానుకూల సంకేతంగా చూస్తుండగా, మరికొందరు దీనిని రాజకీయ పరిణామంగా విశ్లేషిస్తున్నారు.రాఖీ కట్టిన అనంతరం సురేఖ వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించారు. పండుగ రోజు ఈ అంశంపై వ్యాఖ్యానించదలుచుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
అయితే, పార్టీ క్రమశిక్షణ ప్రక్రియ మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల రాఖీ భేటీతో రాజకీయ విభేదాలు పూర్తిగా ముగిశాయని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది….
కాంగ్రెస్‌లో ఇక ఏం జరగబోతోంది?
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో మూడు అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఒకటి కొండా సురేఖపై ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రెండు కేబినెట్ ప్రక్షాళనలో సురేఖకు చోటు ఉంటుందా? మూడు రేవంత్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో కొండా కుటుంబం రాజకీయ సంబంధాలు ఎలా మారతాయి?ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశముంది.మొత్తానికి, కొండా సురేఖపై చర్యలు తప్పవనే స్థాయిలో సాగిన చర్చ మధ్య.. సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా రాఖీ కట్టడం రాజకీయంగా అనూహ్య పరిణామంగా మారింది. రాఖీ బంధం రాజకీయ విభేదాలకు నిజంగానే ముగింపు పలికిందా? లేక ఇది కేవలం పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఆత్మీయ భేటీ మాత్రమేనా? అన్నది కాంగ్రెస్ అధిష్ఠానం తదుపరి నిర్ణయాలతో స్పష్టమయ్యే అవకాశం ఉంది….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
