తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన…దమ్మపేటలో ఘనంగా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

Pathi Sreenivas Rao
2 Min Read

దమ్మపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలతో విసిగిపోయిన ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ వేగంగా ఎదుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ గడల శ్రీనివాస్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది.దమ్మపేట మండల అధ్యక్షుడు ఎస్.కే. రహీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా డా. గడల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా జనసేన ఇంచార్జి మిరియాల రామకృష్ణ హాజరై, పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించి సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభించారు….

ఈ సందర్బంగా గడల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై అప్పుడే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన విమర్శించారు. ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాల హామీ అమలు కాకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మదిరలో జరిగిన నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యమని దుయ్యబట్టారు.రైతు బంధు, రైతు బీమా వంటి కీలక పథకాల అమలులో నెలకొన్న లోపాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారని ఆయన గుర్తుచేశారు.”సామాజిక తెలంగాణ” నిర్మాణమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని డా. శ్రీనివాస్ ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు….

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. తెలంగాణలో కూడా అటువంటి పారదర్శకమైన, ప్రజా సంక్షేమ పాలనను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.స్థానిక కాంగ్రెస్ నాయకులు కేవలం హైదరాబాద్‌కే పరిమితమై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ స్థానికంగా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు….

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఇన్‌చార్జ్ బండి నరేష్, రాము యాదవ్, అశ్వారావుపేట ఇన్‌చార్జ్ డేగల రామచంద్రరావు, ముయ్యబోయిన ఉమాదేవి.దమ్మపేట మండల అధ్యక్షులు ఎస్.కే. రహీం, ఇస్లావత్ వినోద్ కుమార్,తాటికొండ ప్రవీణ్,వేణు,  కిషోర్ కుమార్ నాయుడు,ములకలపల్లి యువజన విభాగ జిల్లా నాయకుడు గరికె రాంబాబు, జంగ చందు, నాగేంద్ర, శ్యామ్, పోసి కుమార్, మల్లెం రామకృష్ణ, అంకత సాయి, గొల్ల వీరభద్రం, మంగ దొడ్డి ఆనంద్ కుమార్, కిషోర్ వీరితో పాటు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article