తెలంగాణా /ఖమ్మం జిల్లా :
ఖమ్మం:ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సాగునీటి లభ్యత, వినియోగం, ప్రాజెక్టుల నుండి నీటి విడుదలపై రైతులకు పూర్తి స్పష్టతనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర సాగునీటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సాగునీటి నిర్వహణ, రైతాంగ సంక్షేమంపై పలు కీలక సూచనలు చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షపాతంలో కలుగుతున్న హెచ్చుతగ్గుల దృష్ట్యా అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల సాగుకు అవసరమైన నీటి లభ్యతపై రైతుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కోరారు. ప్రభుత్వం నీటి లభ్యతపై ముందస్తు స్పష్టత ఇస్తే, రైతులు దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు….
ప్రాజెక్టుల నిల్వలపై సమీక్షించి నీటి విడుదల షెడ్యూల్ ఇవ్వాలి…
ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రధాన జల వనరులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మాజీ మంత్రి సూచించారు.నాగార్జునసాగర్, గోదావరి, మున్నేరు, వైరా, పాలేరు, కిన్నెరసాని వంటి ప్రధాన జల వనరులతో పాటు రిజర్వాయర్లు, చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని,ప్రాజెక్టుల నుండి ఎప్పుడు నీటిని విడుదల చేస్తారు? ఏ ఏ ప్రాంతాలకు ఎంత మేరకు నీరు అందుబాటులో ఉంటుంది? అనే అంశాలపై అధికారికంగా నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలని,సాగునీటి లభ్యత ఆధారంగా ఆయకట్టు రైతులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించడం ద్వారా వారు పంటల ఎంపిక, విత్తనాలు చల్లే సమయం, నీటి వినియోగంపై సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు….
రైతాంగానికి నష్టం కలగకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి…
సాగునీటి నిర్వహణలో ఎలాంటి అనిశ్చితి లేకుండా రైతుల ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పువ్వాడ కోరారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడితే, రైతులు పంట నష్టపోకుండా ప్రణాళికాబద్ధంగా సాగును ముందుకు తీసుకెళ్లవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట 9703973456
