తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ , జూన్ 09: ఖమ్మం నగరంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పసిమొగ్గ లాంటి చిన్నారులకు రక్షణ కరువవుతున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఎంతో చైతన్యవంతమైన, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఖమ్మం నగరంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని పువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. పసిపిల్లలపై కామాంధులు ఇలాంటి ఘాతుకాలకు ఒడిగట్టడం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోందన్నారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత ఉన్న ఖమ్మం గడ్డపై ఇలాంటి సంస్కృతి ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు…..
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండ….
ఊహించని ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన బాధిత బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగే వరకు బాసటగా ఉంటామని స్పష్టం చేశారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యంతో పాటు మానసిక స్థైర్యాన్నిచ్చే కౌన్సెలింగ్ అందించాలని కోరారు అదే విధంగా ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా విచారణను వేగవంతం చేయాలని పువ్వాడ డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, పోక్సో (POCSO) తదితర కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలన్నారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, ఇలాంటి తప్పు చేయాలంటే భవిష్యత్తులో మరెవరైనా వణికిపోయేలా కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిహారం అందించి, ఆర్థికంగా, నైతికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు…..
శాంతిభద్రతలే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం….
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మాజీ మంత్రి సూచించారు. ప్రజల రక్షణ, భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగం నిఘా పెంచి, నగరంలో పెట్రోలింగ్ ముమ్మరం చేసి అసాంఘిక శక్తుల ఆటకట్టించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
