తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం క్రైమ్: ఖమ్మం నగరంలో పశుప్రవృత్తికి పాల్పడిన ఓ కీచకుడి అమానుష ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించడమే కాకుండా, ఆ దారుణాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా ఆమెను భవనం పైనుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనపై ఖమ్మం 2వ పట్టణ పోలీసులు తక్షణం స్పందించి, ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ
రమణమూర్తి తెలిపారు…..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ లో గల జీ. ప్రైడ్ (G.Pride) అపార్ట్ మెంట్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మహ్మద్ గౌస్ (57) అనే వ్యక్తి, ఈ నెల 6వ తేదీన (06.06.2026) ఒక మైనర్ బాలికపై కన్నేశాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయం చూసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో, తన పైశాచికత్వం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కిరాతకంగా ఆమెను బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేశాడు.ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఖమ్మం 2వ పట్టణ (టూ టౌన్) పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు సీరియస్ గా స్పందించిన పోలీసులు.. నిందితుడిపై హత్యాయత్నం మరియు పోక్సో (POCSO) చట్టాల కింద కేసులు నమోదు చేసి వెంటనే టూటౌన్ సిఐ బాలకృష్ణ నెత్రుత్వంలో దర్యాప్తు ప్రారంభించారు….
24 గంటల్లోనే నిందితుని అరెస్ట్….
కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని (స్టేట్మెంట్) రికార్డు చేసి, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సంఘటనా స్థలంలో సేకరించిన పక్కా ఆధారాలతో కేసు నమోదైన 24 గంటల్లోపే నిందితుడు మహ్మద్ గౌస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, పూర్తి దర్యాప్తు అనంతరం మిగిలిన వివరాలను వెల్లడిస్తామని ఏసీపీ రమణమూర్తి తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే ఇలాంటి అకృత్యాల పట్ల పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు…..
సోషల్ మీడియా యూజర్లకు పోలీసుల తీవ్ర హెచ్చరిక….
ఈ సున్నితమైన కేసులో బాధితురాలి గుర్తింపును ఎవరైనా బయటపెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. బాధితురాలి పేరు గానీ, ఫొటోలు గానీ, ఇతర ఎలాంటి వివరాలను గానీ సోషల్ మీడియా (వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ తదితర) ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేసినా, ఫార్వార్డ్ (Circulate) చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలా చేసే వారిపై కూడా పోక్సో (POCSO Act) మరియు నూతన క్రిమినల్ చట్టం బీఎన్ఎస్ (BNS Act) ప్రకారం నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏసీపీ రమణమూర్తి స్పష్టం చేశారు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
