మైనర్ బాలికపై లైంగిక దాడికేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు.. ఒత్తిళ్లకు తలొగ్గని టూటౌన్ సీఐ !!

Pathi Sreenivas Rao
4 Min Read

ఖమ్మం సిటీ (రాపర్తి నగర్): సభ్య సమాజం తలదించుకునేలా ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించి,
ఆ విషయం బయటకు వస్తుందనే భయంతో ఆమెను అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు పైనుంచి కిందకు తోసేశాడు దీంతో పేద బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఈ హృదయ విదారక ఘటనలో నిందితుడిని కాపాడేందుకు రాజకీయ నాయకులు రంగంలోకి దిగడం అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది…..

జూన్ ఆరవ తేదీన ఈ ఘోరం జరిగినా, ఆలస్యంగా బయటకు రావడానికి ప్రధాన కారణం ఏమిటనేది అంతుపట్టని విషయం,నిందితుడు ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, బాధితురాలి తల్లిదండ్రులు కూలినాలి చేసుకుని బ్రతికే నిరుపేద  కుటుంబం కావడంతో స్థానిక రాజకీయ నాయకులు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పాప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ముందుగా వైద్యంపైనే దృష్టి పెట్టారు.ఇదే అదనుగా తీసుకున్న కొందరు వ్యక్తులు కేసు నమోదు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపస్తున్నాయి .

సాధారణంగా పైనుంచి పడిపోయిన ఘటనలు గానీ ఉద్దేశ్య పూర్వకంగా దాడి జరిగినప్పుడు గానీ (Medico-Legal Cases – MLC), వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. కానీ అలా చేస్తే ప్రభుత్వ వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు, తద్వారా కేసు పక్కాగా నమోదు అవుతుంది. దీన్ని నివారించడానికే, అత్యవసర వైద్యం పేరుతో పక్కా ప్రణాళికతో బాలికను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టమవుతోంది. మెడికల్ రిపోర్టులను తారుమారు చేయడానికి లేదా డాక్టర్లను మేనేజ్ చేసి ‘ప్రమాదవశాత్తు పడిపోయింది’ అని క్రియేట్ చేయడానికి ఈ ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.అంతే కాకుండా “రూ. 20 లక్షలు ఇప్పిస్తాం, సైలెంట్ గా కేసు ఉపసంహరించుకోండి అంటూ కొందరు వ్యక్తులు బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు…..

నిందితుడు గత ప్రభుత్వంలో ఉన్న BRS పార్టీకి చెందినవాడైనప్పటికీ, ప్రస్తుత అధికార పార్టీ నేతలు అతనికి అండగా నిలవడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల మధ్య పైకి పార్టీల రంగులు ఉన్నా, చీకటి వ్యాపారాల్లో వారికి ఒకరికొకరు సహకరించుకునే ఒప్పందాలు ఉంటాయని స్థానికులు విమర్శిస్తున్నారు. డబ్బు,పలుకుబడి ముందు పార్టీ సిద్ధాంతాలు పక్కకు పోయాయని ఈ ఘటన నిరూపిస్తోంది.ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అధికార పార్టీకి చెందిన ఒక మాజీ కార్పొరేటర్ ఏకంగా పోలీసులతోనే బేరసారాలకు దిగడం విశేషం,అంతేకాకుండా జూన్ 8వ తేదీ సాయంత్రం 6:00 గంటల నుంచి 8:00 గంటల వరకు నేరుగా
టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించి, నిందితుడిపై కేసు నమోదు చేయొద్దంటూ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం….

అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని రాజకీయంగా ఎంత ఒత్తిడి చేసినా,బెదిరింపులకు గురిచేసినా ఖమ్మం టూ టౌన్ సీఐ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చట్టం ముందు అంతా సమానులే అని నిరూపిస్తూ, రాజకీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి నిందితుడిపై కఠినమైన పోక్సో (POCSO – Protection of Children from Sexual Offences), హత్యాయత్నం (Attempt to Murder) తదితర నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.దీంతో సీఐ చూపించిన నిజాయితీ పట్ల స్థానిక ప్రజల్లో నుండి హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి….

ఖమ్మం రాపర్తినగర్లో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్పందించారు.ముక్కు పచ్చలారని చిన్నారిపై
ఘతుకానికి పాల్పడిన మానవ మృగాన్ని చట్టపరంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.బాధిత బాలిక తల్లిదండ్రులు తన నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో బాలిక తండ్రితో ఆయన ఫోన్లో మాట్లాడారు.”ముందు పాప ప్రాణాలు మనకు ముఖ్యం,అధైర్యపడకండి.. నేనున్నా” అని ధైర్యం చెప్పారు. బాలికకు మెరుగైన వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.పాప వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు……

మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి పైనుంచి కిందకు తోసేసిన ఒక మానవ మృగాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన అధికార పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్‌ తీరుపై మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిందితుడిని కఠినంగా శిక్షించాలని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అలాగే, నిందితుడికి సహకరించి, బాధితులను ప్రలోభపెట్టాలని చూసిన మాజీ కార్పొరేటర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment