ఎన్టీఆర్ అందరివాడు.. ఆయన చరిత్రను ధ్వంసం చేయడం దుర్మార్గం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం సిటీ: తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఖమ్మం నగరంలో ఘనంగా జరిగాయి. నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ అంటే అమితమైన అభిమానం అని చెప్పారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రూపం ఎన్టీఆర్ దేనని కొనియాడారు. సమాజంలో కుల వివక్ష లేని పార్టీని నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పార్టీని స్థాపించి, ప్రజలందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. దివిసీమ ఉప్పెన సమయంలో బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ఖమ్మం వచ్చినప్పుడు ఇక్కడి అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారని ఆనాటి జ్ఞాపకాలను పువ్వాడ నెమరువేసుకున్నారు….

దేశ రాజకీయాల్లో 25 సంవత్సరాలకు పైబడి మనగలిగిన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన చరిత్ర భావితరాలకు తెలిసేలా శిలాఫలకాలపై లిఖించామని పువ్వాడ తెలిపారు.అయితే, ఇటీవల కొందరు ఆ శిలాఫలకాలను ధ్వంసం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పార్టీలకు అతీతుడని, అందరివాడని.. మహానుభావుడిపై అంత ద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పార్టీలు వేరైనా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు….

ఈ కార్యక్రమానికి వల్లభనేని రామారావు అధ్యక్షత వహించగా, నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, కర్నాటి కృష్ణ, తాళ్లూరి జీవన్, బిక్కసాని ప్రశాంతి, లక్ష్మి జస్వంత్, నాగండ్ల కోటేశ్వరరావు, బత్తుల మురళి, సామినేని హరిప్రసాద్, వీరు నాయక్, పొన్నం వెంకటేశ్వర్లు, సిరిపురపు సుదర్శన్, మోరంపూడి ప్రసాద్, కొల్లు పద్మ, షకీనా, జయకర్, రావూరి శ్రీను, హరిప్రసాద్, కోటేశ్వరరావు, గుత్తా రవి, రామారావు, ప్రదీప్, వెంకటేశ్వర్లు తదితర నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment