పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, అక్రమ కేసులపై ప్రొఫెసర్ నాగేశ్వర్ స్ట్రాంగ్ కౌంటర్ !!

Pathi Sreenivas Rao
3 Min Read

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరియు తనపై నమోదైన కేసుల నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తన గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోనని, ప్రాణాలు పోయినా తన భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోబోనని ఆయన కుండబద్దలు కొట్టారు. తనను అరెస్టు చేస్తామని బెదిరిస్తే భయపడే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  జరిగిన “తెలంగాణ గొంతులపై ఆంధ్రా  ఇనుప బూట్లు ఇంకెంత కాలం” అనే అంశపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాలు పాల్గొన్న ఆయన ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు…..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(A) కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవరూ హరించలేరని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. తనపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని కొందరు భయపెడుతున్నారని, తనకు ఏమాత్రం భయం లేదని ఆయన తేల్చి చెప్పారు. “నాకు భయం ఉంటే ముందస్తు బెయిల్ (Anticipatory bail) కోసం దరఖాస్తు చేసుకునేవాడిని, కానీ ఆ పని చేయలేదు, చేయను కూడా” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన 62 ఏళ్ల జీవితంలో ఎన్నో అనుభవాలు చూశానని, జైలుకు వెళ్లడం కూడా తన ఆత్మకథలో ఒక అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. 30 ఏళ్ల వయసులో యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడే అప్పటి సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్టికల్ రాసి ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చినా భయపడలేదని, ఇప్పుడు అసలే భయపడనని స్పష్టం చేశారు…..

తన వ్యాఖ్యల్లో ఎక్కడా కులం ప్రస్తావన లేకపోయినా, కులచిచ్చు పెడుతున్నానని తనపై అక్రమంగా కేసులు పెట్టారని నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కులం, ప్రాంతం గురించి మాట్లాడింది రాజకీయ పార్టీల నాయకులేనని మండిపడ్డారు. తెలంగాణ వాడైన తాను ఏపీ రాజకీయాల గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తాను ఏ కులంలో పుట్టాలనేది తన చేతుల్లో లేదని, ఎప్పుడూ అనగారిన వర్గాల పక్షానే నిలబడ్డానని ఆయన గుర్తుచేశారు. తన మాటల వల్ల ఎక్కడ అల్లర్లు జరిగాయో, ఎవరికి నష్టం జరిగిందో పోలీసులు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం వర్డ్స్ (పదాలు) ద్వారా చేసిన కామెంట్స్ కు వర్తించని సెక్షన్ల కింద తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎద్దేవా చేశారు.

ఏపీకి సంబంధించిన అసలైన ప్రజా సమస్యలను రాజకీయ పార్టీలు, మీడియా గాలికి వదిలేశాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు.విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చి, ప్రధాన ఆదాయం వచ్చే కిరండాల్-కోరాపుట్ లైన్‌ను ఒడిశాకు కేటాయిస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. తనపై గంటల తరబడి టీవీల్లో డిబేట్లు పెట్టేవాళ్లు ఈ అన్యాయంపై ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు అంతే కాకుండా మచిలీపట్నం, పామర్రు ప్రాంతంలో ఓఎన్జీసీ కనుగొన్న విలువైన చమురు, గ్యాస్ నిక్షేపాలను, తూత్తుకుడిలో ప్రజలను చంపిన చరిత్ర ఉన్న ‘వేదాంత’ కంపెనీకి అప్పగిస్తే దానిపై ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదని మండిపడ్డారు.ఇలాంటి వాస్తవాలను పబ్లిక్ గా ప్రశ్నిస్తున్నందుకే తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు…..

ఒక్కసారి బెదిరిస్తే నోరు మూసుకుంటారనే ‘డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్’ తన దగ్గర పనిచేయదని నాగేశ్వర్ హెచ్చరించారు. ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా, పనికట్టుకుని మరీ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానన్నారు. “యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను” అని ఆయన సవాల్ విసిరారు. చావనైనా చస్తాను కానీ మాట్లాడే హక్కును మాత్రం వదులుకోనని, పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే సమయం, ప్లేస్ చెబితే తానే స్వయంగా వస్తానని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment