ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్‌లో ఘనంగా నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు !!

Pathi Sreenivas Rao
1 Min Read

ఖమ్మం సిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిచెప్పిన దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య, 55వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు….

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతనిప్పు కృష్ణ చైతన్య మరియు మోతారపు శ్రావణి సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డకు నిజమైన ప్రజాస్వామ్య పరిమళాలు అద్దింది ముమ్మాటికీ ఎన్టీఆర్ పాలనే అని కొనియాడారు. తెలుగుజాతి గౌరవాన్ని దేశ విదేశాలలో ఇనుమడింపజేసి, తెలుగు భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించాలని వారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఒక నిలువెత్తు మార్గదర్శకమని వారు పేర్కొన్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో పయనిస్తూ, తెలుగువారి ప్రతిష్ట మరింత ఇనుమడించేలా కృషి చేయాల్సిన బాధ్యత నేటి సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం యువత, అభిమానులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య, మాజీ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్‌లతో పాటు స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఆద్యంతం “జోహార్ ఎన్టీఆర్” అన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment