ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి ‘పవనాలు’: అంతా ఆ అధికారి ఇష్టారాజ్యమేనా?

Pathi Sreenivas Rao
3 Min Read

ఖమ్మం సిటీ మే 11: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (KMC) మొత్తం ప్రస్తుతం ఓ అధికారి కనుసన్నల్లో నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “నేనే రాజు.. నేనే మంత్రి” అన్న చందంగా సదరు అధికారి సాగిస్తున్న వ్యవహారశైలిపై కార్పొరేషన్ వర్గాల్లోనే కాకుండా, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. పంచాయతీ రాజ్ విభాగం నుండి డిప్యూటేషన్‌పై వచ్చిన ఈ అధికారి, ఇప్పుడు కార్పొరేషన్‌కే సర్వాధికారిగా మారిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి….

ప్రస్తుతం కార్పొరేషన్‌లో వింత పరిస్థితి నెలకొంది. సామాన్య ప్రజలు లేదా బాధితులు కమిషనర్‌ను కలవాలంటే ముందుగా ఈ ‘డిప్యూటేషన్’ అధికారి అనుమతి తీసుకోవాల్సిందేనట. ఆయనకు ఇష్టం ఉన్న వారికే అపాయింట్‌మెంట్ దొరుకుతుందని, మిగిలిన వారిని గంటల తరబడి వేచి చూసేలా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.చివరకు సమస్యల మీద సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న తాను స్క్రూటీని చేసి ఒకే చెబితేనే సమాధానం వస్తుందని లేకుండా బుట్టదాకలేనని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

గత కొన్నేళ్లుగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తిష్టవేసుకుని కూర్చున్న ఈ అధికారికి ఎన్ని నెలల పాటు డిప్యూటేషన్ ఆర్డర్ ఉంది? అసలు గడువు ముగిసినా పంచాయతీ రాజ్ శాఖ ఎందుకు పదే పదే రెన్యువల్ చేస్తోంది? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇంకా ఇక్కడే పాగా వేయడం వెనుక ఉన్న బలమైన శక్తులెవరో అర్థం కాక తోటి ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు…..

టౌన్ ప్లానింగ్ నుండి ఇంజినీరింగ్ విభాగం వరకు.. శానిటేషన్ నుండి ఎస్సెస్మెంట్ల దాకా సదరు అధికారి పెత్తనం సాగుతోంది.
తనకు గులాంగిరి చేస్తేనే  వారికి ప్రాధాన్యత  ఇవ్వడం,తనకు వంతపాడే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందలాలు ఎక్కించడం, ప్రశ్నించిన వారిని వేధించడం ఇక్కడ నిత్యకృత్యమైంది.అంతే కాకుండా కాంట్రాక్టర్ల బిల్లులు మొదలుకొని అంగుళం ఫైల్ కదలాలన్నా ఆయన “గ్రీన్ సిగ్నల్” తప్పనిసరి అయిందని విమర్శలు వస్తున్నాయి,అదే విధంగా
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియమకాల్లో కూడా ఆయన చెప్పిందే వేదమని సమాచారం. గతంలో తప్పుడు ఎస్సెస్మెంట్స్ చేసి సస్పెండైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకురావడానికి తెర వెనుక సదరు అధికారి చక్రం తిప్పుతున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి….

పై అధికారులను “కాకా” పట్టడంలో సదరు అధికారి ఆరితేరిపోయారని, అందుకే ఆయన ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, ముఖ్య నాయకుల అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు సైతం తమ పనులు కావాలంటే ఈ అధికారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడాల్సి వస్తోందని సమాచారం.

నగర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మున్సిపల్ కమిషనర్
ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టను మసకబారుస్తున్న ఇటువంటి అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి,పాలనను పారదర్శకంగా మార్చాలని ఖమ్మం నగర ప్రజలు కోరుతున్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment