తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ఇప్పుడు చిచ్చు రేపుతోంది.నిన్న టీపీసీసి విడుదల చేసిన నామినేటెడ్ పదవులు విషయంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీలకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న పార్టీకి, తాజా నామినేటెడ్ పదవుల కేటాయింపు తలనొప్పిగా మారింది. పార్టీ కోసం కష్టపడిన కేడర్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతుండగా, సామాజిక సమీకరణాల విషయంలో హైకమాండ్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి…..
కులాల ‘తమాషా’.. అగ్రవర్ణాలకే అగ్రతాంబూలం?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో పదవుల పందేరం ఒక్కసారి గమనిస్తే ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెరిగిందని బలహీన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర స్థాయి కీలకమైన రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు నిన్న ప్రకటించిన నామినేట్ పదవుల్లో కూడా వైస్ చైర్మన్ పదవి ఆ సామాజిక వర్గానికి దక్కింది.అంతే కాకుండా జిల్లా స్థాయిలో అత్యంత కీలకమైన సుడా (SUDA) చైర్మన్ పదవి, అటు నగర మేయర్ పీఠంతో పాటు అర్బన్ డిసిసి అధ్యక్ష పదవి కూడా అదే సామాజిక వర్గం చేతిలో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఒకే వర్గానికి ఇన్ని కీలక పదవులు కట్టబెట్టడం వెనుక మతలబు ఏమిటని, కాంగ్రెస్ పార్టీ గెలుపులో మా కులాల ఓట్లు లేవా అంటూ సామాన్య కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు…..
పదవుల పందేరంలో అన్యాయానికి గురైన బహుజనుల పరిస్థితి ఏంటి?
జిల్లా జనాభాలో సింహభాగం ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గణనీయమైన ఓట్లు కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా లేకపోవడం విశేషం,గత బి.ఆర్.ఎస్ పార్టీ హయాంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు కాపు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు,అంతే కాకుండా ముదిరాజ్,రెడ్డి, మాదిగ కులాలకు పదవుల విషయంలో పూర్తిగా అన్యాయం జరిగిందని ఆయా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి….
పార్టీ కోసం పాటుబడిన సీనియర్లకు మొండిచేయి….
అదే విధంగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్న పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వ్యయ ప్రయాసలకోర్చి అహర్నిశలు శ్రమించిన,మానుకొండ రాధాకిషోర్,కొత్త సీతారాములు, వడ్డేబోయిన నరసింహారావు,పొదిలి రవికుమార్, బచ్చు మధు, కల్లూరి సోమనాథం లాంటి అనేక మంది సీనియర్ నాయకులను కనీసం ప్రాధాన్యతలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని కార్యకర్తలు వాపోతున్నారు,ఈ పరిణామాలతో బలహీన వర్గాల్లో ఒక రకమైన అభద్రతా బావం ఏర్పడిందని,ఒడ్డు దాటేదాక ఓడ మల్లన్న,ఒడ్డు దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఓట్లు వేయించుకునేటప్పుడు ‘బహుజన’ జపం చేసే నాయకులు, పదవుల దగ్గరికి వచ్చేసరికి మొండిచేయి చూపిస్తున్నారని ఆయా వర్గాల నేతలు కినుక వహిస్తున్నారు.”త్యాగాలు మేం చేయాలి.. భోగాలు మీరు అనుభవించాలా?” అంటూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు…..
పదవుల పందేరంపై మైనార్టీల ఆగ్రహం….
ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న మైనార్టీలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి పార్టీకి అండగా నిలిచినా, తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై ముస్లిం మైనార్టీ నేతలు అసమ్మతి గళం విప్పుతున్నారు,ఇటివల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తీవ్రంగా కృషి చేసిన మహ్మద్ జావేద్ కుటుంబంలో ఎవరికో ఒకరికి పదవి ఇచ్చి ఉండివుంటే బాగుండేదని అలా కాకుండా మైనారిటీ వర్గాల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందని మైనారిటీ వర్గాలు భావిస్తున్నాయి….
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ‘తడాఖా’ హెచ్చరికలు….
ఈ అసంతృప్తి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. “ఇప్పుడు మమ్మల్ని విస్మరిస్తే, ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం” అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.మంత్రుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాల వల్ల నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని సామాజిక సమతుల్యతను పాటించకపోతే, కంచుకోటలాంటి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…

జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
