జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో తాజా, మాజీల అక్రమాల పుట్ట తొవ్వే కొద్ది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, తాజాగా కోయచలక రెవెన్యూ పరిధిలోని 192 సర్వే నెంబర్లో ఉన్న పద్దెనిమిది ఎకరాల ఎస్సైన్డ్ భూమిని మాజీ ప్రజాప్రతినిధి బామ్మర్దుల పేరుమీద, తాజా ప్రజాప్రతినిధి తన సమీప బంధువుల పేరుమీద కొనుగోలు చేసి
ఒక్కో ఎకరానికి యాభై ఐదు ప్లాట్లు చొప్పున విభజించి దాదాపు వెయ్యి ప్లాట్లను ఒక్కో ప్లాటుకు ఐదు నుండి పదిలక్షల రేటుకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి….

అంతే కాకుండా ప్లాట్లు చేసి అమ్ముకున్న పద్దెనిమిది ఎకరాలతో పాటు పక్కన ఉన్న కొంత ప్రభుత్వ భూమిని కలుపుకుని 192/23/3 సర్వే నెంబర్లో ఎకరం ముప్పై కుంటల (1.30) భూమిని దాదాపు పదిమందికి పది కుంటలు,అయిదు కుంటలుగా విభజించి మాజీ ప్రజాప్రతినిధి బామ్మర్దులు అమ్ముకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది (అమ్మిన వారి ,కొన్న వారి డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగ కూడదనే సదుద్దేశంతో వారి పేర్లు బయటకు చెప్పడం లేదు)…ఆయన బామ్మర్దులు అమ్ముకోగా లేనిది మేమెందుకు అమ్ముకో కూడదని రంగంలోకి దిగిన తాజా ప్రజాప్రతినిధి బంధువులు 192/23/2 సర్వే నెంబర్లో మరో ఎకరం ముప్పై కుంటల భూమిని (1.30) కుంటలుగా విభజించి సొమ్ము చేసుకోవడం విశేషం,అసలు ఎస్సైండ్ భూమి ఉంటే లబ్ధిదారుల దగ్గర ఉండాలి,లేకుంటే గవర్నమెంట్ స్వాధీనంలోనైనా ఉండాలి కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే కోయచలక రెవెన్యూ పరిధిలోని 192 సర్వే నెంబర్లో ఎస్సైండ్ భూమి తాజా,మాజీల కబ్జా కోరల్లో చిక్కింది…

రఘునాథపాలెం మండల రెవెన్యూ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ పంచాయతీలో ఇంత జరుగుతున్న,ఇన్ని ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవుతున్న రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు,గ్రామ పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసిన 2023 ఫిబ్రవరి 21 నుండి తిరిగి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన 2025 డిసెంబర్ నెల వరకు మండల డిప్యూటీ తహసీల్దార్ ఒకరు పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరించారు,దాదాపు రెండు సంవత్సరాలపాటు స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరించిన సదరు డిప్యూటి తహసీల్దార్ కు ఇక్కడ జరిగే అక్రమాలు కనిపించలేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు….

ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరు అనుమానస్పదంగా ఉందని ఇన్ని అక్రమాలు జరుగుతున్న మండల రెవెన్యూ యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనేది అంతు పట్టని రహస్యంగా ఉందని,తమ కండ్ల ముందే నకిలీ పత్రాలు సృష్టిస్తున్నా, తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పంచాయతీ కార్యదర్శి ముద్రలను టాంపర్ చేసి, పోర్జరీ సంతకాలు చేసి ఈఅమాయక ప్రజలను మోసం చేస్తున్న రెవెన్యూ అధికారులు ఎందుకు కిక్కురుమనడం లేదని అక్రమార్కులతో వీళ్లకున్న సంబంధ బాంధవ్యాలు ఏమిటని? ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
