ఉమ్మడి ఖమ్మం జిల్లా: Jan13:1:2026
నిన్న కొత్తగూడెం పట్టణంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పదవీ ప్రమాణ స్వీకార సభలోరాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు,ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు
అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్నామని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నామని అన్నారు,మా మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దని అన్నారు,కష్ట నష్టాలకోర్చి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోసిన కార్యకర్తలకు ఒక అన్నగా,తమ్ముడిగా అండగా ఉంటాననని హామీ ఇచ్చారు,అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ వట వృక్షమని,చెట్టు పచ్చగా ఉంటేనే మనమందరం చల్లగా ఉంటాం కానీ కూర్చున్న చెట్టు కొమ్మలను,మోడళ్లను నరుక్కుంటే మన ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు, ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పలు ఊహాగానాలకు తెరలేపాయి….
మంత్రి పొంగులేటి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది,ముగ్గురు మంత్రులం అన్నదమ్ముల్లా ఉంటున్నామని బయటకు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది,అసలు కూర్చున్న చెట్టు కొమ్మలు,మొదళ్ళు నరికే ప్రయత్నం చేస్తున్నదెవరు,ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయా,పైకి అంతా హాయ్,భాయ్ గానే ఉన్నప్పటికీ లోలోపల ముగ్గురు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా,అంటే నిజమేననే అభిప్రాయం జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు,కార్యకర్తల్లో వినిపిస్తుంది,….
ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్థాన్ని ఒకసారి పరికించి చూస్తే ఈ మధ్య కాలంలో ముగ్గురు మంత్రులు ఎవరికీ వారే అన్నట్లు ఎవరి నియోజకవర్గాల్లో వారు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ముగ్గురు మంత్రులు కలిసి వేదిక పంచుకున్న దాఖలాలు లేవు,అడపా దడపా జరిగే ముఖ్యమంత్రి పర్యటనల్లోనో,జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో తప్ప ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పనిచేసినట్లు కనిపించడంలేదు,అపుడపుడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిసి ఉమ్మడి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఎక్కడా మిగతా మంత్రులతో కలిసి పాల్గొన్నట్లు లేదు,పైకి అందరం కలిసి మెలిసి పని చేస్తున్నాం అంటూనే ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం గమనార్హం….
ఒక విధంగా చెప్పాలంటే గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి,ఎందుకంటే నిన్న అశ్వారావుపేట ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో
జరిగిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పాల్గొన్నారు కానీ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి జిల్లాలో ఉండి కూడా కార్యక్రమానికి హాజరవక పోవడం,అదే నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేయడం గమనార్హం……
అంతే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు వందకోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మంచుకొండ ఎత్తి పోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు కానీ,పెద్ద ఎత్తున జరిగిన ప్రారంబోత్సవ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రితో సహా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు హాజరవకపోవడంపై కార్యకర్తలు,నాయకుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి,పైకి ముగ్గురం కలిసే ఉన్నామని కలరింగ్ ఇస్తున్నప్పటికీ అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తుందని మంత్రి పొంగులేటి నిన్న కొత్తగూడెంలో చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ అని కార్యకర్తలు,నాయకులు భావిస్తున్నారు,ఏది ఏమైనా కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్లు,విబేధాలు పక్కన పెట్టీ,ముగ్గురు మంత్రులు ఒక త్రాటి మీద నిలబడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని కార్యకర్తలు కోరుతున్నారు…
