తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం/మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు వరుణుడు అడ్డంకిగా మారాడు. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరగాల్సిన ఈ భారీ బహిరంగ సభకు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ‘రైతు భరోసా’ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన
ఈ కార్యక్రమం, ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి….

రూ. 9 వేల కోట్లతో రైతు భరోసా.. ప్రతిష్టాత్మక ఏర్పాట్లు…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న అతిపెద్ద బహిరంగ సభ ఇదే. ఈ సభా వేదిక నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబంధించిన సుమారు రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుమారు 2 లక్షల మంది రైతులను సమీకరించేలా 30 ఎకరాల్లో భారీ సభా ప్రాంగణం, వాహనాల కోసం 150 ఎకరాల్లో పార్కింగ్, ప్రత్యేకంగా హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. వర్ష సూచనల నేపథ్యంలో భారీ వ్యయంతో వాటర్ ప్రూఫ్ జర్మన్ షెడ్లను సైతం నిర్మించారు….

బురదమయంగా ప్రాంగణం.. కాలు మోపలేని పరిస్థితి
సభా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్న తరుణంలో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. జర్మన్ షెడ్లు వేసినప్పటికీ ప్రాంగణం చుట్టుపక్కల ప్రాంతాలు, రైతులు నడిచి వచ్చే మార్గాలు, ముఖ్యంగా 150 ఎకరాల పార్కింగ్ స్థలం పూర్తిగా చిత్తడిగా మారాయి. మైదానమంతా నీరు చేరడంతో కాలు తీసి కాలు పెట్టలేని దయనీయ పరిస్థితి నెలకొంది. డోజర్లు, రోలర్లతో మట్టిని చదును చేసినప్పటికీ వర్షం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకపోవడంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది….

సభ వాయిదా పడేనా..?
రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది రైతులు హాజరయ్యే కార్యక్రమం కావడంతో, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సభను నిర్వహిస్తే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బురదలో వాహనాలు చిక్కుకుపోయే అవకాశం ఉండటంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా పునరాలోచనలో పడింది. వర్షం ఇలాగే నిరంతరాయంగా కొనసాగితే సభను తాత్కాలికంగా వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షం తగ్గుముఖం పడితే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి యథాతథంగా సభను కొనసాగించాలా? లేక వాతావరణం అనుకూలించే మరో తేదీకి మార్చాలా? అనే దానిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనుంది. వరుణుడు కరుణిస్తాడా లేదా అని అటు రైతులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
