బిల్లులు రాలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.. పెట్రోల్ బాటిల్‌తో కుటుంబ సమేతంగా ఆందోళన!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం సిటీ (దానవాయిగూడెం): ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రవేశపెట్టిన ‘మన ఊరు – మన బడి’ పథకం పనులు చేసిన ఓ కాంట్రాక్టర్, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసినా.. ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో విసుగెత్తిపోయి ఏకంగా తాను పనులు చేసిన ప్రభుత్వ పాఠశాలకే తాళం వేశాడు. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే ఖమ్మం నగర పరిధిలోని దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు – మన బడి’ ప్రణాళిక కింద పాఠశాల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను చల్లా అయోధ్య అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అధికారుల సూచనల మేరకు తన సొంత డబ్బులు, అప్పులు తెచ్చి మరీ పాఠశాలలో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశాడు. అయితే పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం నుంచి అతనికి రావాల్సిన సుమారు రూ. 11 లక్షల బిల్లులు నేటికీ మంజూరు కాలేదు. అధికారుల చుట్టూ తిరిగి వేసారిన కాంట్రాక్టర్ అయోధ్య, తనకు న్యాయం జరగాలంటే నిరసన తెలపడమే మార్గమని భావించి సోమవారం ఉదయాన్నే వెళ్లి స్కూల్ గేటుకు తాళం వేశాడు…..

ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు గేటుకు తాళం వేసి ఉండటాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. కాంట్రాక్టర్ లోపలికి ఎవరినీ అనుమతించకపోవడంతో వారంతా ఆరుబయటే నిలబడిపోయారు. చివరకు విద్యార్థులు ఎండలో ఇబ్బంది పడకూడదని భావించిన ఉపాధ్యాయులు, పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్‌కు వారిని తరలించి అక్కడే కూర్చోబెట్టారు. దీంతో విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.స్కూల్‌కు తాళం వేయడమే కాకుండా.. కాంట్రాక్టర్ అయోధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాడు. చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి తనకు రావాల్సిన బిల్లులను మంజూరు చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పాటుపడిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి తలెత్తుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ విషయంపై స్పందించి.. పెండింగ్ బిల్లులను మంజూరు చేసి కాంట్రాక్టర్‌కు న్యాయం చేయాలని, అలాగే విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment