భారీ వర్షాల ఎఫెక్ట్: ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి “రైతు ఆశీర్వాద”సభ రద్దు.. హైదరాబాద్‌కు మార్పు!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • అకాల వర్షాలతో జలమయమైన చింతకాని సభా ప్రాంగణం....
  • రేపు హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచి 'రైతు భరోసా' నిధుల పంపిణీ....
  • రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులనుద్దేశించి సీఎం ప్రసంగం....
  • వానాకాలం సీజన్‌కు ఎకరాకు రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ...

తెలంగాణ రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ‘రైతు భరోసా’ నిధుల పంపిణీ కార్యక్రమం వేదిక మారింది. రేపు (జూన్ 30న) ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి “రైతు ఆశీర్వాద సభ” ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దయింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సభను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం….

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ముఖ్యమంత్రితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా ఈ సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే, నిన్న కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురు గాలుల ధాటికి సభా ప్రాంగణం, రైతులు కూర్చునే ప్రదేశం పూర్తిగా జలమయమయ్యాయి. వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడం, రానున్న రోజుల్లో కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు…..

ఖమ్మం సభ అనివార్య కారణాల వల్ల రద్దయినప్పటికీ, రైతులకు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం షెడ్యూల్ ప్రకారమే వానాకాలం (ఖరీఫ్) రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హైటెక్స్ సమీపంలో ఉన్న శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.రేపు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఎకరాకు రూ. 6,000 చొప్పున (వానాకాలం సీజన్‌కు) రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ కానున్నాయి. దీనికోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది…..

బహిరంగ సభ రద్దయిన నేపథ్యంలో, సాంకేతికత ద్వారా అన్నదాతలకు చేరువ కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు వీక్షించేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్ విధానం) ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో మాట్లాడనున్నారు. గ్రామాల్లోని రైతులు ఎవరికి వారు తమ సమీపంలోని రైతు వేదికల వద్దకు చేరుకుని, డిజిటల్ స్క్రీన్ల ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. సభ రద్దయినా నిధుల విడుదలలో జాప్యం లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment