తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం (జూన్ 20):తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ పేరిట ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను నిలువునా దగా చేసిందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. గురువారం ఖమ్మం జిల్లా తెలంగాణ భవన్ (బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు…కే
సీఆర్ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలం….
తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ కాలం నుండి నేటి వరకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతాంగ పక్షపాతేనని తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన పోరాటం వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన దాదాపు 40,000 గొలుసుకట్టు చెరువులను ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా రికార్డు కాలంలో పునరుద్ధరించి, కరువు ప్రాంతాలను జలకళతో ఉట్టిపడేలా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.ఖమ్మం జిల్లా పరిధిలోని అత్యంత వెనుకబడిన పాలేరు నియోజకవర్గ (కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలు) సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చేందుకు ‘భక్త రామదాసు ప్రాజెక్టు’ను కేవలం 9 నెలల రికార్డు కాలంలో పూర్తి చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన ఉద్ఘాటించారు. జిల్లాను మరింత సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన ‘సీతారామ ప్రాజెక్టు’ పనులను కూడా బీఆర్‌ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తి చేశామన్నారు.
కానీ, డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా కనీసం ఒక్క తట్టెడు మట్టి పని కూడా చేయలేదని విమర్శించారు. పైగా, గతంలో తవ్విన కాల్వల మట్టిని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అక్రమంగా అమ్ముకుంటూ దోపిడీకి తెరలేపారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు…..
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట దగా..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు,,ఎకరాకు ₹15,000 పెట్టుబడి సహాయం అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి, నేడు ఆర్థిక ఇబ్బందుల నెపంతో ₹12,000 మాత్రమే ఇస్తామంటూ మాట మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు అంతే కాకుండా క్వింటాల్ వడ్లకు ₹500 బోనస్, మొక్కజొన్నకు ₹2,200 మద్దతు ధరతో పాటు 10 రకాల పంటలకు మద్దతు ధర ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, నేడు రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తే… నేడు కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేక, లారీల రవాణా సదుపాయం లేక, మిల్లుల్లో అన్‌లోడింగ్ కాక రైతులు నడిరోడ్డుపై అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే ఉద్యమమే…..
సాంకేతిక లోపాలు, యాప్‌ల నెపంతో కాలయాపన చేస్తూ… కేంద్ర ప్రభుత్వం ఎంత చెబితే అంతకంటే ఎక్కువ కొనలేమని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రులు తక్షణమే తెలంగాణ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మధుసూదన్ డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతాంగ పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్ చైర్మన్ ఆర్.జేసీ (గుండాల) కృష్ణ, అడ్వకేట్ జేఏసీ నాయకులు బిచ్చాల తిరుమలరావు, మాజీ మండల, నగర పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, బంక మల్లయ్య, బలుసు మురళీకృష్ణ, యలమద్ది రవి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
