సత్తుపల్లి నియోజకవర్గం, బుగ్గపాడు “ఫుడ్ పార్క్” భూదోపిడీపై భగ్గుమన్న పువ్వాడ!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • బుగ్గపాడు "ఫుడ్ పార్క్" భూదోపిడీపై భగ్గుమన్న పువ్వాడ....
  • ‘దీపక్ నెక్స్ట్ జెన్’ కంపెనీకి కారుచౌకగా వందల కోట్ల విలువైన భూములు కట్టబెట్టిన వైనం....
  • సీతారామ ప్రాజెక్టు కాలువల నుంచి మట్టి, కలప అక్రమ రవాణా....
  • మంత్రి తుమ్మల,ఆయన కుమారుడి పాత్రపై సమగ్ర దర్యాప్తు జరగాలి....
  • ఖమ్మం జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుక, మట్టి మాఫియాలు.....

ఖమ్మం, జూన్ 20 : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల వ్యవహారంతో ఒక్కసారిగా వేడెక్కాయి.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడే లక్ష్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. వందల కోట్ల రూపాయల విలువైనప్రభుత్వ భూములను క్యాబినెట్ ఆమోదం లేకుండా తన అనుయాయులకు కారుచౌకగా కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు….అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవినీతి, భూకబ్జాలు, మట్టి మాఫియా యథేచ్ఛగా సాగుతున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో భారీ ఎత్తున భూదోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఈ కుంభకోణంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడి ప్రమేయం ఉందని, దీనిపై తక్షణమే పారదర్శకమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు…..

ఖమ్మం జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే సత్సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బుగ్గపాడు ఫుడ్ పార్క్‌కు రూపకల్పన చేశారు. అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా దీనికి శంకుస్థాపన చేశారని పువ్వాడ గుర్తుచేశారు. కానీ, నేడు ఆ లక్ష్యాన్ని పక్కదారి పట్టించి, వందల కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఆ భూములను “దీపక్ నెక్స్ట్ జెన్” అనే కంపెనీకి చాలా తక్కువ ధరకు అక్రమంగా కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. మంత్రి తుమ్మల తన అనుయాయుల లబ్ధి కోసమే నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని మండిపడ్డారు.తక్కువ రేటుకు భూములను కొట్టేయడమే కాకుండా, పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని పువ్వాడ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ప్రాజెక్టు కాలువల నుంచి పెద్ద ఎత్తున మట్టిని, కలపను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ఇదంతా మంత్రి తనయుని అండదండలతోనే జరుగుతోందని ఆరోపించారు…..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇసుక, మట్టి, భూ మాఫియాలు పేట్రేగిపోతున్నాయని పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి దందా వెనుక మంత్రుల, వారి కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు. బుగ్గపాడు భూముల కేటాయింపు ప్రక్రియను వెంటనే నిలిపివేసి, “దీపక్ నెక్స్ట్ జెన్” కంపెనీతో జరిగిన ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నతస్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గితే, బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment