బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులో భారీ కుంభకోణం…క్విడ్ ప్రో కో …ఆరోపించిన సండ్ర వెంకట వీరయ్య !!

Pathi Sreenivas Rao
3 Min Read

ఖమ్మం జిల్లా,సత్తుపల్లి: నియోజకవర్గ పరిధిలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపు ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీని వెనుక అధికార పీఠానికి చెందిన పెద్దల హస్తం ఉందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆయన మండిపడ్డారు…..

తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGIIC) నిబంధనల ప్రకారం బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో ఎకరా కనీస మద్దతు ధరను ₹40 లక్షలుగా నిర్ణయించడం జరిగిందని సండ్ర గుర్తు చేశారు. అయితే, ఈ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ రొయ్యల సీడ్ కంపెనీకి కేవలం ₹21 లక్షలకే (దాదాపు సగం ధరకే) 75 ఎకరాల పైగా భూమిని కేటాయించారని ధ్వజమెత్తారు. ఇంత తక్కువ ధరకు భూములను ధారాదత్తం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటో, ఎవరికి ఎంత లబ్ధి చేకూరిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు……

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేద గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుండి సేకరించిన భూమి ఇదని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన ఈ భూమిని ప్రైవేట్ సంస్థకు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రివర్గం (క్యాబినెట్) ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో నాబార్డ్ (NABARD) వాటా 30 శాతం ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని, వారి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏకపక్షంగా భూ కేటాయింపులు ఎలా చేస్తారని ఆయన ఆక్షేపించారు. ఈ వ్యవహారం వెనుక జిల్లాకు చెందిన ఒక మంత్రి, లేదా వారి కుమారుల హస్తం ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తపరిచారు…..

ఈ ప్రైవేట్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు 90 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే నిబంధనలపై ఎలాంటి స్పష్టత లేదని సండ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు న్యాయం జరగని పక్షంలో ఈ భూముల కేటాయింపు ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. దీనికి తోడు, సీతారామ ప్రాజెక్టు కాల్వల తవ్వకం నుండి వచ్చిన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మట్టిని, ఇక్కడ ల్యాండ్ లెవెలింగ్ (భూమి చదును) పేరిట అక్రమంగా తరలించి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ సందర్భంగా పలు డిమాండ్లు చేశారు ముఖ్యంగా
వివాదాస్పదమైన ఈ భూముల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పునఃసమీక్ష జరపాలనీ,ఈ కుంభకోణంపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలనీ, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భూములను విక్రయించి, ప్రభుత్వ ఆస్తులను, ప్రజా ధనాన్ని కాపాడాలనీ డిమాండ్ చేశారు….

అదే విధంగా పార్టీ సంస్థాగత కార్యక్రమాల గురించి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పలు వివరాలు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ (బుధవారం) ఉదయం 10:30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు సంస్థాగత బలోపేతంపై (SIR) ఒక రోజు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విచ్చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది పూర్తిగా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరం కావడంతో, పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన బూత్ స్థాయి ఇన్‌ఛార్జులు, ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment