తెలంగాణ /హైదరాబాద్ :
హైదరాబాద్: ఖమ్మం పట్టణంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణమైన దాడి ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఘటనలో గాయపడి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను బీఆర్ఎస్ నేతల బృందం బుధవారం పరామర్శించింది. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు….
వైద్యులతో సమీక్ష.. కుటుంబానికి భరోసా….
నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో స్వయంగా మాట్లాడిన హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి.. బాలికకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను, ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలిక కోలుకునేందుకు అవసరమైన మరింత మెరుగైన, అత్యాధునిక సంరక్షణను అందించాలని వైద్యులను కోరారు. తీవ్ర ఆందోళన మరియు వేదనలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు.”మానవీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. న్యాయం జరిగే వరకు పోరాడుతాం”అని నాయకులు వారికి భరోసా ఇచ్చారు…..
నిమ్స్‌లో మందుల్లేవా? హరీశ్ రావు తీవ్ర విమర్శలు….
ఆసుపత్రి సందర్శన అనంతరం నిమ్స్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన నిమ్స్ ఆసుపత్రిలో కనీస మందులు కూడా అందుబాటులో లేకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.”ఖమ్మంలో జరిగిన ఈ ఘటన అత్యంత హృదయ విదారకమైనదని,సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితని,ఆ బాధిత కుటుంబానికి ఎంత దుఖం ఉంటుందో ఒకసారి మన గుండె మీద చేయి వేసుకొని ఆలోచిస్తే తెలిసి వస్తుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదు. పేదలకు ఉచిత వైద్యం అందించే నిమ్స్ ఆస్పత్రిలో కనీసం మెడిసిన్ కూడా ఇవ్వకుండా బయట నుంచి తెచ్చుకోమంటున్నారని. బాధితులు తమ సొంత డబ్బులతో మందులు బయట కొనుక్కునే దుస్థితి వచ్చిందని అని హరీశ్ రావు ధ్వజమెత్తారు…..
ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు?
ప్రభుత్వ తీరును ఎండగడుతూ హరీశ్ రావు పలు ప్రశ్నలను సంధించారు. ప్రతిపక్ష నేతలు వస్తున్నారని తెలిసి భద్రత పేరుతో వందలాది మంది పోలీసులను మోహరించిన ప్రభుత్వం, బాధితురాలికి వైద్యం అందించే విషయంలో మాత్రం చేతులెత్తేసిందని విమర్శించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు కీలక మంత్రులు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వైద్యం ఇప్పించే తెలివి లేదని, కేవలం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు పూర్తి ఉచిత వైద్య బాధ్యతలను స్వీకరించాలని బీఆర్ఎస్ బృందం డిమాండ్ చేసింది…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
