నకిలీ విత్తనాల ఆరోపణలు అవాస్తవం.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే పెట్టుబడి ఇచ్చేదెవరు? ఆర్గనైజర్‌కు బాసటగా నిలిచిన రైతులు !!

Pathi Sreenivas Rao
3 Min Read

దమ్మపేట (మద్దులగూడెం):నకిలీ విత్తనాల పేరుతో కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్నదాతలకు అండగా నిలుస్తున్న ఆర్గనైజర్లపై బురదజల్లడం సరికాదని దమ్మపేట మండలం మద్దులగూడెం గ్రామ రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్దులగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు పాల్గొని, స్థానిక రైతు ధారా ప్రసాద్ చేసిన ఆరోపణలను మూకుమ్మడిగా ఖండించారు. శ్రీకర్ మేజ్ సీడ్ ఆర్గనైజర్ బొబత్తుల శివ నాగరాజుకు వారు పూర్తి మద్దతు ప్రకటించారు……

మద్దులగూడెం గ్రామం, పరిసర ప్రాంతాల్లో సుమారు 350 ఎకరాల్లో 29 మంది రైతులు ఆర్గనైజర్ శివ నాగరాజు ద్వారా ‘శ్రీకర్-161’ రకం మొక్కజొన్న విత్తనాలను సాగు చేశారు. అయితే, ఇందులో ధారా ప్రసాద్ అనే ఒక్క రైతు మాత్రమే విత్తనాలు నకిలీవని, తనకు నష్టం వాటిల్లిందని ఆరోపణలు చేశారు. దీనిపై మిగిలిన 28 మంది రైతులు తీవ్రంగా స్పందించారు. తామంతా అదే విత్తనాలు నాటామని, తమందరికీ అద్భుతమైన దిగుబడులు వచ్చాయని, విత్తనాల్లో ఎలాంటి లోపం లేదని వారు ఆధారాలతో సహా స్పష్టం చేశారు. దిగుబడి తగ్గడానికి యాజమాన్య లోపాలు లేదా వాతావరణ పరిస్థితులు కారణం కావొచ్చని, దానికి నకిలీ విత్తనం అని ముద్ర వేయడం దారుణమన్నారు…..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తున్న మాట వాస్తవమే. పత్తి, మిర్చి, మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటల్లో లైసెన్స్ లేని దళారులు నకిలీ విత్తనాలను అంటగట్టి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు సైతం పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తూ దీనిపై ఉక్కుపాదం మోపుతున్నారు.అయితే, సమాజంలో ఉన్న ఈ “నకిలీ విత్తనాల” భయాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు అందించినప్పటికీ, ఆర్గనైజర్లను భయపెట్టి డబ్బులు గుంజాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి “నకిలీ” ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు….

ప్రస్తుత రోజుల్లో ఎకరం సాగు చేయాలంటే రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతోంది. ఈ తరుణంలో బ్యాంకులు సైతం ఏదో ఒక పూచీకత్తు (గ్యారంటీ) లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. ఇలాంటి గడ్డు కాలంలో చిన్న, సన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎకరా భూమి కూడా లేని కౌలు రైతులకు కేవలం నమ్మకం మీద ఆర్గనైజర్లు లక్షల రూపాయల పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు.ధారా ప్రసాద్ వంటి వ్యక్తులు చేసే నిరాధారమైన ఆరోపణల వల్ల భవిష్యత్తులో రైతులకు పెట్టుబడి పెట్టేందుకు ఆర్గనైజర్లు ఎవరూ ముందుకు రారని, అదే జరిగితే వ్యవసాయం పైనే ఆధారపడిన పేద రైతుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీకర్-161 విత్తనాలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ,నకిలీ విత్తనాలు ఎక్కడ ఉన్నా అధికారులు కఠినంగా వ్యవహరించాలి, కానీ నిజాయితీగా వ్యవహరించే ఆర్గనైజర్లను బ్లాక్‌మెయిల్ చేసే వారిని ఉపేక్షించకూడదని, అంతే కాకుండా ఈ మొత్తం వ్యవహారంపై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు… అదేవిధంగా వ్యవసాయాన్ని బతికించేది రైతే అయినా, ఆ రైతుకు పెట్టుబడి సాయం చేసే వ్యవస్థను దెబ్బతీస్తే అంతిమంగా నష్టపోయేది అన్నదాతలేనని మద్దులగూడెం రైతులు స్పష్టం చేశారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment