తెలంగాణ /ఖమ్మం జిల్లా:
ఖమ్మం సిటీ:రాజకీయాల్లో కష్టపడే వారికి గుర్తింపు దక్కుతుందన్నది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ జెండాను భుజాన మోసిన నాయకులకు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వారికి చివరకు మిగిలేది అవమానాలే అనడానికి ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు ‘జావేద్’ జీవితమే సజీవ సాక్ష్యం. అధికారంలో ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన ఆరు గ్యారంటీల జావేద్ కు పార్టీ అధిష్టానం, స్థానిక నాయకత్వం బతికున్నప్పుడు తీరని అన్యాయం చేసి, మరణించాక కన్నీరు కారుస్తూ సంతాప సభలకే పరిమితం కావడం పట్ల ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….
కష్టకాలంలో అండగా.. కార్యకర్తలకు బరోసాగా..
గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రతిపక్ష నాయకులపై, కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన అరాచకాలకు వ్యతిరేకంగా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడిన అతికొద్ది మంది నాయకులలో జావేద్ ఒకరు. నిత్యం ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, “నేనున్నా” అంటూ భరోసా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే ప్రతి కార్యకర్త గుండెల్లో స్థానం సంపాదించుకుని, ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్‌కు తలలో నాలుకలా వ్యవహరించారు,రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో జావేద్‌కు దక్కాల్సిన ఖమ్మం అసెంబ్లీ టికెట్ తృటిలో చేజారిపోయింది. ఒక నాయకుడికి ఇంతకంటే పెద్ద నిరాశ మరొకటి ఉండదు. అయినా సరే జావేద్ ఏమాత్రం కుంగిపోలేదు. తన స్వార్థం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావించి, పార్టీ నిలబెట్టిన అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకూ తీసుకెళ్లి, ప్రజల మెదళ్లలో నాటుకుపోయేలా ప్రచారం చేశారు. ఈయన చేసిన ప్రచారానికి ముగ్ధులైన ప్రజలు, కార్యకర్తలు ఒకానొక సమయంలో ఆయన పేరును “ఆరు గ్యారెంటీల జావేద్” గా మార్చారంటే ఆయన పనితీరు అర్థం చేసుకోవచ్చు. జావేద్ కష్టం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల ఫలితంగానే ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా 55 వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించడంలో ఆయన పాత్ర కీలకమైనది….
జావేద్ కి పదవి రాకపోవడం వెనుక ఏమి జరిగింది ?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జావేద్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని, మొదటి విడతలోనే ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. కానీ ఇక్కడే ఆయనకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పార్టీలోని కొందరు నాయకులే ఉద్దేశపూర్వకంగా జావేద్‌కు ఎలాంటి పదవి రాకుండా అడ్డుకున్నారని ఆయన అనుచరులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.పార్టీ కోసం సర్వస్వం ధారపోసి, రాత్రింబవళ్లు కష్టపడిన తనకు దక్కింది అవమానాలేనని జావేద్ కొంత మనస్థాపానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ హైదరాబాద్ లో ఉంటూ తన సొంత వ్యాపారాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ క్రమంలోనే విధి రోడ్డు ప్రమాదం రూపంలో జావెద్ ను బలిగొన్నదని కార్యకర్తలు వాపోతున్నారు….
సంతాప సభలతో చేతులు దులుపుకుంటారా?
జావేద్ బతికి ఉన్న కాలంలో ఆయన కష్టాన్ని గుర్తించకుండా, ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టిన నాయకులు.. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో మొక్కుబడిగా సంతాప సభలు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని పాత కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. నివాళులు అర్పించడం, గొప్పలు చెప్పడం కాదు.. నిజంగా పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఇవ్వాలనుకుంటే, తక్షణమే కాంగ్రెస్ అధిష్టానం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి జావేద్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, ఆయన కుటుంబానికి రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలబడాలని ఖమ్మం కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
