ఖమ్మంలో కాకరేపిన రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు: మున్సిపల్ అధికారుల హామీతో దీక్ష విరమించిన వి.హెచ్ !!

Pathi Sreenivas Rao
3 Min Read

ఖమ్మం సిటీ: నగరంలోని కాల్వొడ్డు సెంటర్‌లో ఉన్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో బాగంగా మున్సిపల్ అధికారులు తొలగించడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు,రాజకీయ దుమారానికి దారితీసింది. అధికారుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతురావు (వి.హెచ్), మాజీ పీసీసీ అధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్‌లతో కలిసి ఖమ్మంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని, నిరసన విరమించేది లేదని వి.హెచ్ భీష్మించుకు కూర్చున్నారు….

కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణప్రదంగా భావించే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించి, దానిని మళ్లీ ఎక్కడ పునఃప్రతిష్ఠిస్తారో చెప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాగుడుమూతలు ఆడుతున్నారని “అసలు” కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరాయి పార్టీ నాయకుల విగ్రహాలను మెయిన్ సెంటర్లలో పెడుతున్న బడా కాంగ్రెస్ నాయకులకు, సొంత పార్టీ దైవ సమానుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తుంటే కండ్లు కనిపించడం లేదా? అంటూ కాంగ్రెస్ పార్టీ కేడర్ మండిపడుతోంది…..

రాష్ట్ర స్థాయి నాయకుడు,మాజీ రాజ్యసభ సభ్యుడు
వి.హనుమంతురావు,మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ లాంటి వారు నడిరోడ్డుపై నిరసన కార్యక్రమం చేపడితే.. ఖమ్మం నగరంలో ఉన్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం వచ్చి సంఘీభావం కూడా తెలియజేయకపోవడం దురదృష్టకరమని ఒక సీనియర్ నాయకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం….

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడాలో.. లేక మొదటి నుండి కాంగ్రెస్ జెండా మోస్తూ వస్తున్న తమ లాంటి అసలు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నామని మరో సీనియర్ నాయకుడు వాపోయారు.ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గతానికి భిన్నంగా విచిత్ర పరిస్థితులు నడుస్తున్నాయని పలువురు నేతలు ఆరోపించారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ సంస్థాగత పదవుల్లో కానీ ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదనీ,కొత్తగా పార్టీలోకి చేరిన వారికి, పైరవీకారులకే పీఠాలు దక్కుతున్నాయని,పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హీనంగా చూస్తున్నారు. “త్యాగాలు మావి.. భోగాలు మీవా?” అంటూ సీనియర్ నేతలు స్థానిక నాయకత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు….

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిరసన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగానే, తొలగించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తిరిగి అదే స్థలంలో పూర్తి గౌరవంతో పునఃప్రతిష్ఠిస్తామని అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. అధికారుల స్పష్టమైన హామీతో వి.హనుమంతురావు, సంభాని చంద్రశేఖర్ తమ నిరసన కార్యక్రమాన్ని విరమించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త సీతారాములు, తాళ్లూరి హనుమంతురావు, గజ్జి సూర్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article