ఖమ్మంలో పసారా (PSARA) చట్టం ఉల్లంఘించిన సెక్యూరిటీ ఏజెన్సీలపై పోలీసుల కొరడా !!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం:నగరంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పసారా (PSARA – Private Security Agencies Regulation Act) చట్టాన్ని ఉల్లంఘించి కార్యకలాపాలు సాగిస్తున్న నలుగురు ఏజెన్సీ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు….

గత కొంతకాలంగా టూ టౌన్ పరిధిలో పలు ఏజెన్సీలు ప్రభుత్వ లైసెన్సులు లేకుండానే ప్రైవేట్ వ్యక్తులకు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సీపీ సునీల్ దత్ ఆదేశాలతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించిన నలుగురిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు….

ఈ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహించే వారు తప్పనిసరిగా పసారా (PSARA) చట్టం ప్రకారం ప్రభుత్వ లైసెన్సులు పొందాలని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామనే నెపంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఏజెన్సీలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment