తండాల కష్టాలకు శాశ్వత పరిష్కారం…గిరిజన బిడ్డల రుణం తీర్చుకుంటా!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • - రాబోయే మూడు నెలల్లోనే బీటీ రోడ్డు పూర్తి కావాలి: అధికారులకు డెడ్‌లైన్....
  • - రూ. 7.15 కోట్లతో గోప తండా బీటీ రోడ్డుకు శంకుస్థాపన....
  • - నర్సింహులగూడెం అభివృద్ధికి రూ.17 కోట్లు మంజూరు....
  • - రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి.....

కూసుమంచి:గతంలో సరైన రహదారులు లేక గిరిజన తండాల ప్రజలు పడిన కష్టాలను తాను కళ్లారా చూశానని, ఇప్పుడు మంత్రి హోదాలో ఆ కష్టాలను శాశ్వతంగా తీర్చి ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద గురువారం ఆయన జిల్లా కలెక్టర్ వి.టి. దివాకరతో కలిసి కీలకమైన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.నర్సింహులగూడెం నుంచి గోప తండా వరకు దశాబ్దాలుగా ఉన్న రవాణా సమస్యను పరిష్కరిస్తూ.. రూ. 7.15 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు….

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. “నేను గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో అనేకసార్లు పర్యటించాను. అప్పట్లో ఇక్కడి రహదారులు అత్యంత అధ్వాన్నంగా ఉండేవి. ఆ గుంతల రోడ్ల మీద ప్రయాణిస్తూ మన గిరిజన బిడ్డలు పడిన కష్టాలు నా మనసును కలచివేశాయి. నాటి నుంచి నేటి వరకు ఇక్కడి ప్రజల ఆశీర్వాదం, ప్రేమాభిమానాలే నన్ను ఈ ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. మంత్రిగా ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. అందుకే గిరిజనుల కష్టాలు శాశ్వతంగా తీర్చి, నాపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను” అని ఆయన స్పష్టం చేశారు….

శంకుస్థాపన చేసిన బీటీ రోడ్డు పనుల విషయంలో మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని, రాబోయే మూడు నెలల్లోగా (90 రోజుల్లో) ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజల వినియోగానికి తీసుకురావాలని ఖచ్చితమైన గడువు విధించారు. అలాగే, కేవలం రోడ్లు మాత్రమే కాకుండా నర్సింహులగూడెం గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 17 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు…..

గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఇందులో భాగంగా అర్హులైన పేదలందరికీ ‘ఇందిరమ్మ ఇళ్లు’, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ‘ఉచిత ప్రయాణం’, రైతులకు ‘రూ. 2 లక్షల రుణమాఫీ’, అలాగే రైతు పండించిన ‘సన్నబియ్యానికి అదనపు బోనస్’ వంటి కీలకమైన సంక్షేమ పథకాలను నిరంతరాయంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో తండా వాసులు పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment