సంక్షేమం,అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • రూ. 4.02 కోట్లతో 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన....
  • తెల్దారుపల్లిలో ఇప్పటికే రూ. 9 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు...
  • త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లపై కేబినెట్‌లో నిర్ణయం.....
  • లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ....

ఏదులాపురం, మే 21:రాష్ట్రంలో ప్రజల సంక్షేమంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు…..

ఏదులాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారి వరకు (వయా రాముడు చెరువు మార్గం) నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 3.6 కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఈ రోడ్డు కోసం ప్రభుత్వం రూ.4 కోట్ల 2 లక్షలను మంజూరు చేసిందన్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు ఎంతో కాలంగా ఉన్న రవాణా కష్టాలు తీరి, మెరుగైన ప్రయాణ సదుపాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఒక్క తెల్దారుపల్లి ప్రాంతంలోనే ఇప్పటివరకు సుమారు రూ.9 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు…..

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తోందన్నారు. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా గురుకులాల్లో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం మేర పెంచినట్లు తెలిపారు….

నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీని అమలు చేశామని, సన్న ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్ అందిస్తున్నామని వివరించారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కొత్త ఆసరా పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు….

ఈ సభ అనంతరం మంత్రి పొంగులేటి, కలెక్టర్ దివాకర టీఎస్ చేతుల మీదుగా నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థలాల అప్పగింతతో పాటు పట్టా ధృవీకరణ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment