రైతు పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం: చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం:మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి !!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం/పాలేరు:తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ తీరును, మద్దతు ధర అమలును మరియు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు….

ధాన్యంలో తాలు, చెత్త పేరుతో మిల్లర్లు క్వింటాల్‌కు 5 నుండి 6 కేజీల వరకు అదనంగా కోత విధిస్తున్నారని రైతులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై  మంత్రులు తీవ్రంగా స్పందిస్తూ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లులను అవసరమైతే వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, లారీ ఏజెన్సీలు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రవాణా సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు,సేకరించిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా లారీల సంఖ్యను పెంచాలనీ,లారీల కొరత ఉన్న చోట ఇతర అవసరాల కోసం వాడే డీసీఎంలను, లారీలను ధాన్యం రవాణాకు మళ్లించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు అంతే కాకుండా అక్కడక్కడ ఉన్న హమాలీల కొరతను అధిగమించి, సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు…..

రైతు పక్షపాతిగా ఉన్న ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ నెలాఖరు వరకు కొనుగోళ్లపై నిర్ణయమే ఉండేది కాదని, ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర వారిదని గుర్తు చేశారు.గత ప్రభుత్వం ‘వరి వేస్తే ఉరి’ అంటే.. మా ప్రభుత్వం వరి పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు ,ఈ సీజన్లో సుమారు రూ. 22,000 కోట్ల రూపాయలతో 85 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు కొనుగోలు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని,చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు,….

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు….అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు మరియు సివిల్ సప్లై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు సాంబశివరావు, రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment