పువ్వాడ ఉదయ్ నగర్లో రెవెన్యూ అధికారుల “భూ” విచారణ తూతూ మంత్రం!!

Pathi Sreenivas Rao
4 Min Read
...

రఘునాథపాలెం మండలం “పువ్వాడ ఉదయ్ నగర్”
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది, ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూదాన్ భూముల తరువాత అత్యధికంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన ప్రాంతంగా వార్తల్లోకి ఎక్కింది, రెవిన్యూ అధికారుల అలసత్వం,రాజకీయ పార్టీల అండదండలతో గత ప్రజాప్రతినిధి, ప్రస్తుత ప్రజాప్రతినిధి అవినీతి వెరసి నేడు పువ్వాడ ఉదయ్ నగర్ మరో వెలుగుమట్ల భూదాన్ భూముల పరిస్థితిని తలపిస్తుంది, కోయచలక రెవెన్యూ పరిధిలోని 192 సర్వే నెంబర్లో దాదాపు పద్దెనిమిది ఎకరాల ఇరువై కుంటల ఎస్సైండ్ భూమిని అక్రమంగా ప్లాటుగా విభజించి అక్రమంగా అమ్ముకుని తాజా,మాజీలు కోట్లకు పడుగలెత్తితే,ఆ భూమికి ఆనుకుని ఉన్న మరో ఎనిమిది ఎకరాల ఎస్సైండ్ భూమిని ఓ మట్టి వ్యాపారి తన బినామీ అయిన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఒక మాజీ సర్పంచ్ పేరు మీద కొనుగోలు చేసి, చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసి తెలివిగా ఫామాయిల్ మొక్కలను నాటడం విశేషం….

సదరు మట్టి వ్యాపారి కొనుగోలు చేసిన భూమి పీవోటి యాక్ట్ ప్రకారం ఇతరులు కొనుగోలు చేయడం అక్రమమని,దానిపై విచారణ చేయాలంటూ రఘునాథపాలెం సిపిఎం పార్టీ నేతలు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది,ఈ విషయం మీద కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు కానీ ఈ విచారణకు సంబంధించి ఓ అధికారి సదరు మట్టి వ్యాపారికి సమాచారం లీక్ చేయడంతో జాగ్రత్త పడిన మట్టి వ్యాపారి అసలు పట్టా దారులను బెదిరించి విచారణ జరిగినంత సేపు భూమి దగ్గర నిలబెట్టి,ఎవరు ఏది అడిగినా ఇది మా భూమీ,మేమే వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పాలని ఒత్తిడీ చేయడంతో పాటు,దీనికి భిన్నంగా చెబితే గతంలో ఏం జరిగిందో తెలుసుగా అంటూ బెదిరించినట్లు పట్టదారుల బంధువులు చెప్పడం గమనార్హం,గత ప్రభుత్వ హయాంలో కేవలం మట్టి తవ్వుకోవడం కోసం రైతుల దగ్గర అగ్రిమెంట్లు తీసుకుని తన రాజకీయ పలుకుబడితో ఆ భూమిని కాజేయాలనే దురుద్దేశంతో ప్రస్తుత పట్టదారుల మీద పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించి నయనా,భయానా బెదిరించి రైతుల దగ్గర తన బినామీ పేరు మీద కొనుగోలు అగ్రిమెంట్లు వ్రాయించుకుని, రైతును బెదిరించి సంతకాలు చేయించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు,ఆ కేసుల తాలూకు భయమే ఇప్పటికీ వారిని వెంటాడుతుందని అందుకే సదరు మట్టి వ్యాపారి ఏది చెబితే చేస్తున్నారని రైతు బంధువులు వాపోతున్నారు….

ఇది ఇలా ఉంటే విచారణ చేయడం కోసం వచ్చిన అధికారి ఎవరిని ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే తూతూ మంత్రంగా
విచారణ ముగించి సదరు మట్టి వ్యాపారికి అనుకూలంగా
రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది,దీంతో రెచ్చిపోయిన మట్టి వ్యాపారి నన్ను ఎవడు….ఏం… లేడు,నాకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి,ఏ అధికారైనా నేను చెప్పినట్లు రిపోర్ట్ ఇవ్వాల్సిందే,ఈ భూమి విషయంలో ముఖ్యంగా రఘునాథపాలెం మండలానికి చెందిన ఇద్దరు మంత్రి ప్రధాన అనుచరుల పేర్లు ఉపయోగించడం,ఈ భూమి విషయం అన్నకు కూడా తెలుసు అంటూ ఓ మంత్రి కుమారుడిని ఈ వివాదంలోకి లాగడం విశేషం,వాస్తవానికి స్వతహాగా ఇలాంటి విషయాల జోలికి వెళ్ళని మంత్రి కుమారుడు ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాలి….

అంతే కాకుండా సదరు వ్యాపారి అక్రమాలు ఒక్క రఘునాథపాలెం మండలానికే పరిమితం కాలేదు చింతకాని, ముందిగొండ మండలాల్లో కూడా పాగా వేశాడు, ముదిగొండ మండలం,గంగాపురం (డిజాస్టర్ విలేజ్) రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 122,123,124,125,126 లలో పదమూడు ఎకరాల ముప్పై అయిదు కుంటల ముంపు భూమిని కొనుగోలు చేసి దానికి గేటు అమర్చి ఇసుక వ్యాపారుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేయడంతో పాటు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి రాగా దానిపై విచారణకు ఆదేశించాడు దాంతో రంగంలోకి దిగిన కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్వయంగా విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇవ్వడం,ఈ విషయంలో ఒక తహసీల్దార్ ,ఒక సబ్ ఇన్స్పెక్టర్ బదిలీ అవడం,సదరు వ్యాపారిపై చింతకాని పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగింది, కానీ సదరు వ్యాపారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు,అతన్ని అరెస్ట్ చేయాలంటే పోలీసు యంత్రాంగం బయపడుతుందంటేనే అతని రాజకీయ పలుకుబడి ఏమిటనేది ఇట్లే అర్ధం చేసుకోవచ్చు,అంతే కాకుండా సదరు వ్యాపారి బాదితులు ఎంతోమంది “జనం ముచ్చట” తో తమ గోడు వెల్లబుచ్చుకుంటున్నారు,అతని ఉచ్చులో పడి మోసపోయామంటూ లబో దిబో మంటున్నారు,బాదితులు ఆర్తనాదాలపై వీడియో ఆధారిత కథనం త్వరలో మీ “జనం ముచ్చట” లో ప్రచురితం అవుతుంది….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment