నాపై కాంగ్రెసోల్లు చేసిన దుష్ప్రచారం పటాపంచలైంది.. కేసీఆర్ విలువ ఏంటో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

Pathi Sreenivas Rao
3 Min Read

ఖమ్మం: రఘునాథపాలెం మండలం, వేపకుంట్ల గ్రామంలో జరిగిన బి.ఆర్.యస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు,ఈ సందర్బంగా పువ్వాడ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుడు ప్రచారం, విష ప్రచారం నేడు పటాపంచలైందని స్పష్టం చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు విని ప్రజలు కొంత తప్పుదారి పట్టారని, కానీ నేడు క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించి ఆవేదన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు…..

గత ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి తనపై ఎన్నో నిరాధారమైన ఆరోపణలు చేశారని పువ్వాడ అజయ్ గుర్తుచేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నానని, ఇసుక, మట్టి మాఫియా నడిపిస్తున్నానంటూ ప్రజల మెదళ్లలో తప్పుడు సంకేతాలు పంపేలా తీవ్రమైన దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. “వాళ్లు చేసిన మాటల గారడి ఉచ్చులో పడి మనం కొంత వెనకబడ్డాం తప్ప, మనం ఎన్నడూ ఏ తప్పు చేయలేదు. ఈరోజు మాపై కాంగ్రెస్ చేసిన విష ప్రచారం పూర్తిగా పటాపంచలైంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆరోజు నాపై ఆరోపణలు చేసిన నాయకులు ఈరోజు ఏం చేస్తున్నారో ప్రజలందరికి తెలుసని,పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదనే చందంగా ఎవరెవరు ఎక్కడ కౌంటర్లు ఓపెన్ చేసి వసూళ్లు చేస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని,భూ సెటిల్మెంట్స్,మట్టి మాఫియా ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నాయో ఖమ్మం ప్రజలందరికి తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు…..

ఇవాళ రఘునాథపాలెం మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు వాస్తవాలు మాట్లాడుతున్నారని అజయ్ అన్నారు. “అయ్యా.. మేము తప్పు చేసుకున్నాం. అనవసరంగా మిమ్మల్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం.. మీ విలువ ఏంటో ఇప్పుడు మాకు అర్థమవుతోంది” అని ప్రజలు చెబుతున్నారన్నారు. గత పదేళ్లు తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నానని, రేపుకుంట్ల లాంటి గ్రామాలకు కనీసం 50 సార్లు వెళ్లి ఉంటానని గుర్తుచేశారు. తాను మంత్రిగానో, శాసనసభ్యుడిగానో దర్పం ప్రదర్శించలేదని, ప్రజల ఇంట్లో ఒక కొడుకుగా, అజయ్ అన్నగా పనిచేశానని తెలిపారు. గతంలో మండలంలో తాను బొంగరంలా తిరుగుతూ ప్రతి సమస్యను దగ్గరుండి చూసుకున్నానని, కానీ నేడు గెలిచిన నాయకులు గానీ, గెలిపించమని చెప్పిన వారు గానీ గ్రామాల్లో ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలైనా వారి ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలయ్యాయని పువ్వాడ విమర్శించారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఏడాదిలోపే భర్తీ చేస్తామని చెప్పి నేడు పత్తా లేకుండా పోయారన్నారు. కొత్త జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు.. దీంతో నేడు హైదరాబాద్ లోని సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో నిరుద్యోగులు గర్జిస్తున్నారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు రైతు, యువత, మైనారిటీ, బీసీ అంటూ రకరకాల డిక్లరేషన్లు పేరుతో 420 హామీలు ఇచ్చారని, వాటిలో కనీసం 4 హామీలు కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘మహాలక్ష్మి (ఫ్రీ బస్)’ పథకంపై మాజీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. ఈ పథకం మహిళలు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతోందని విమర్శించారు. తన హయాంలో ఉన్న బస్సు చార్జీలను ఇప్పుడు పురుషులకు డబుల్ చేశారని, ఆడవారికి సీట్ల కోసం పంచాయతీలు పెట్టారని మండిపడ్డారు.ప్రజలు కొంత ఓపిక పట్టాలని, కచ్చితంగా మళ్లీ మంచి రోజులు వస్తాయని పువ్వాడ అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. రెండేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు…..

📄 Generate e-Paper Clip
Share This Article