మల్లెమడుగు భూదందా…ప్లాట్లపై కన్నేసిన ‘వారసుడు’ సర్వే నెంబర్ 186లో ఆగం అవుతున్న సామాన్యుల బ్రతుకులు……

Pathi Sreenivas Rao
3 Min Read
Highlights
  • వివాదాస్పదంగా మారిన ఖమ్మం అర్బన్ మండల రెవిన్యూ అధికారుల తీరు....
  • ప్లాట్లపై కన్నేసిన 'వారసుడు' సర్వే నెంబర్ 186లో ఆగం అవుతున్న సామాన్యుల ఇళ్ల స్థలాలు...
  • వెంచర్‌కు మళ్లీ వ్యవసాయ ముసుగు...2008లోనే కన్వర్షన్ పూర్తయిన భూమికి పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారు?
  • నిబంధనలకు పాతర:పాత తహసీల్దార్లు తిరస్కరించినా, '186/అ/1' పేరుతో కొత్త నంబర్ సృష్టించిన స్వామి...
  • కలెక్టర్ ఆదేశాలకూ బేఖాతర్:గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బ్లాక్ లిస్టులో పెట్టినా ఆగని అక్రమార్కుల ప్రయత్నాలు....
  • అడ్డంగా దొరికినా చర్యలేవి?: తప్పుడు నివేదికలిచ్చిన జీపీవో,తహసీల్దార్లపై ఉన్నతాధికారుల మౌనం దేనికి సంకేతం?
  • తెరవెనుక చక్రం తిప్పుతున్నదెవరు?: భూదందా వెనుక అధికార పార్టీ నేతల అండదండలు, భారీ ముడుపులపై సర్వత్రా అనుమానాలు!
  • రెవెన్యూ మంత్రి పొంగులేటి వద్దకు బాధితులు... చట్టాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులపై ఫిర్యాదుకు సిద్ధమైన ప్లాట్ల యజమానులు....

ఖమ్మం అర్బన్ : మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 186 భూ వివాదం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా అనేక చేతులు మారుతూ, చివరకు సామాన్య ప్రజల సొంత ఇళ్ల స్థలాలుగా మారిన ఈ భూమిపై,అనుమోలు రమేష్ వ్యక్తి తన వారసత్వ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు,అందుకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్న తీరు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినప్పటికి బాధ్యుయులైన అధికారులపై ఇప్పటివరకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు రేఖేత్తుతున్నాయి….

ఈ సర్వే నంబర్ 186 గతంలో అనుమోలు వరప్రసాద్ పేరు మీద పట్టా భూమిగా ఉండేది. ఆ తర్వాత కాలంలో వరప్రసాద్ ఈ భూమిని ఎస్టీ (ST) సామాజిక వర్గానికి చెందిన వారికి విక్రయించారు. కాలక్రమంలో ఈ భూమి పలువురి చేతులు మారుతూ, 2008-2009 ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా రూపాంతరం చెందింది. ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో, వందలాది ప్లాట్లుగా విభజించి సామాన్యులకు, ఉద్యోగస్తులకు విక్రయించడమే కాకుండా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి.అయితే, సాంకేతిక కారణాల వల్ల పహాణీలలో ఇప్పటికీ పట్టాదారుగా అనుమోలు వరప్రసాద్ పేరే కొనసాగుతుండటంతో, ఆయన వారసుడు అనుమోలు రమేష్ దీనిని ఆసరాగా చేసుకున్నారు. 2016లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ల్యాండ్ రికార్డ్స్ అప్‌గ్రేడేషన్ ప్రోగ్రామ్’ (LRUP) ను అడ్డం పెట్టుకుని, అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను అప్పట్లో పనిచేసిన పలువురు తహసీల్దార్లు తిప్పికొట్టారు….

అయితే, 2023-2024 కాలంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన స్వామి, నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి వివాదాస్పద భూమికి ‘186/అ/1’ అనే కొత్త సర్వే నంబరును సృష్టించి, ఐదు ఎకరాల భూమిని అనుమోలు రమేష్ పేరు మీద అక్రమంగా కన్వర్షన్ చేశారు. ఈ వ్యవహారంపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, నాటి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెంటనే స్పందించి ఆ భూమిని బ్లాక్ లిస్టులో పెట్టారు. అంతేకాకుండా, అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్ స్వామిని కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు…

ఈ అంశంపై నాటి కలెక్టర్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో  ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో పలు ప్రశ్నలు ఇప్పుడు అధికారుల పనితీరుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి  2008లోనే ల్యాండ్ కన్వర్షన్ పూర్తి చేసి, ప్లాట్లుగా అమ్మిన భూమిని ‘వ్యవసాయ భూమి’ అని సర్టిఫై చేసిన జీపీవో (GPO)పై మరియు ఇప్పటికే ల్యాండ్ కన్వర్షన్ పూర్తయిన భూమిని, వ్యవసాయ భూమిగా పేర్కొంటూ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆర్డీవోకు సిఫార్సు చేసిన తాజా, మాజీ తహసీల్దార్లపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటనే విషయంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అంతే కాకుండా గతంలోనే ఐదు ఎకరాల భూమిపై అక్రమ ప్రయత్నం జరిగి, నాటి కలెక్టర్ దానిని బ్లాక్ లిస్ట్ చేసిన విషయం తెలిసినా,తాజా,మాజీ తహసీల్దార్లు అంత ధైర్యంగా నిబంధనలను ఎలా ఉల్లంఘించగలిగారు అనే అంశంపై చర్యలు తీసుకోవడంలో ఉన్నత్తాధికారుల వ్యవహారిస్తున్న తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయా, లేక పెద్ద ఎత్తున జరిగిన ముడుపుల వ్యవహారమా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. “మాకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను, అక్రమంగా వ్యవసాయ భూమిగా మార్చి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఎలా జారీ చేస్తారు?” అని ప్రశ్నిస్తున్న బాధితులు, ఈ అక్రమాలపై రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని అపహాస్యం చేస్తూ, సామాన్యుల కష్టార్జితాన్ని దెబ్బతీస్తున్న తీరుపై ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి…..

📄 Generate e-Paper Clip
Share This Article