ఖమ్మంలో గర్జించిన మున్నూరు కాపులు…రాజకీయ తిరుగుబాటుకు వేదికగా “రంగా జయంతి” వేడుకలు….

Pathi Sreenivas Rao
4 Min Read

ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఖమ్మం నగరంలో మున్నూరు కాపు యువత చేపట్టిన భారీ బైక్ ర్యాలీ కేవలం ఒక ఉత్సవంలా కాకుండా, జిల్లా రాజకీయాల్లో రాబోయే ఒక పెద్ద మార్పునకు, మున్నూరు కాపుల రాజకీయ ఆత్మగౌరవ పోరాటానికి బలమైన సంకేతంగా నిలిచింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో మున్నూరు కాపుల ఓట్ల శాతం చాలా ఎక్కువ. దాదాపు 30 నుండి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సామాజికవర్గ ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రత్యక్షంగా,మిగతా జిల్లాల్లో పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రభావిత సామాజికవర్గమైన మున్నూరు కాపులకు నామినేటెడ్, రాజకీయ పదవుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఒక బలమైన తిరుగుబాటు మొదలవబోతోందా అనే చర్చకు ఈ వేడుకలు వేదికగా మారాయి…..

మున్నూరుకాపు సంఘం యూత్ జిల్లా అధ్యక్షుడు తోట రమేష్ కుమార్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి యువత భారీగా ఎంబీ గార్డెన్ వద్దకు చేరుకున్నారు. సంఘం జిల్లా నాయకులు జెండా ఊపి ఈ భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. వంగవీటి మోహన రంగా చిత్రపటాలు, జెండాలు చేతబూని, మోటార్ సైకిళ్లపై యువత కాల్వోడ్డు మీదుగా గాంధీచౌక్, గ్రెయిన్ మార్కెట్ రోడ్, బోస్ బొమ్మ ప్రాంతం, శ్రీనివాస నగర్, చర్చి కాంపౌండ్, జెడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, గట్టయ్య సెంటర్ మీదుగా బైపాస్ రోడ్డు ద్వారా తిరిగి ఎంబీ గార్డెన్‌కు చేరుకున్నారు. నగర వీధులన్నీ రంగా నినాదాలతో, యువత ఉత్సాహంతో మార్మోగాయి.అనంతరం ఎంబీ గార్డెన్‌లో వంగవీటి మోహన రంగా చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, అభిమానుల సందోహం మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ సందర్బంగా పలువురు మున్నూరుకాపు నేతలు మాట్లాడుతూ….”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్రంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా ఎనలేని కృషి చేశారు. అట్టడుగు వర్గాలకు గూడు నిర్మించేందుకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆనాటి పాలకులు ఆయనను భౌతికంగా అంతం చేశారు. కానీ ఆయన ఆశయాలను అంతం చేయలేకపోయారు. నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత ప్రజా సమస్యలపై గళమెత్తుతూనే ఉందని స్పష్టం చేశారు……

ఈ వేడుకల వేదికగా మున్నూరు కాపు నేతలు చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మున్నూరు కాపు సామాజికవర్గానికి ఒక మంత్రి పదవితో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, అనేక స్టేట్ కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ఇచ్చి తగిన గౌరవం కల్పించారని నేతలు గుర్తు చేస్తున్నారు.
కానీ, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా, అండగా నిలిచిన మున్నూరు కాపు నాయకులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో గణనీయమైన ఓట్ల శాతం కలిగి ఉండి, అభ్యర్థుల గెలుపోటములను శాసించే శక్తి ఉన్న మున్నూరు కాపులకు ప్రస్తుత అధికార పార్టీలో ఏ ఒక్క కీలక పదవి ఇవ్వకపోవడంపై కుల పెద్దల్లో, యువతలో తీవ్ర నిరాశ, నిరసన వ్యక్తమవుతోంది.ఈ నిట్టూర్పులు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రమాద ఘంటికలుగా మారే అవకాశం కనిపిస్తోంది…..

త్వరలో జరగబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని మున్నూరు కాపు సామాజికవర్గానికి కేటాయించాలనే డిమాండ్ ఈ వేదిక ద్వారా స్పష్టమైంది. జనాభా ప్రాతిపదికన, రాజకీయ ప్రాధాన్యత పరంగా తమకు దక్కాల్సిన హక్కును సాధించుకునేందుకు మున్నూరు కాపులు ఏకతాటిపైకి వస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.ఈ భారీ బైక్ ర్యాలీ, అన్నదాన   కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పొదిల రవికుమార్, కొత్త సీతారాములు, ఆకుల గాంధీ, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, ఆర్ జె సి కృష్ణ, పసుపులేటి దేవేందర్, మడూరి పూర్ణ, పగడాల కిషోర్, సోదా నరసింహారావు, హారిక నాయుడు.ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు తోట రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్, పాలెపు హనుమాన్ సాయి,రాపర్తి రాజా, దినేష్ నాయుడు, నానాభాల హరీష్, ఆకుల వినయ్, గణేష్ నాయుడు, గుణా, శాసనాలా సాయి రాం, అన్వేష్ నాయుడు, పారా ఉదయ్ కిరణ్ తదితరులతో పాటు యువత, రంగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment