ఖమ్మం విజయా డైరీ మూసివేతతోగందరగోళంలో పాడి రైతులు.. ప్రశ్నార్థకంగా మారిన జీఎం వివరణ!!

Pathi Sreenivas Rao
3 Min Read

ఖమ్మం: దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా నిలిచిన ఖమ్మం విజయా డైరీకి అకస్మాత్తుగా తాళం పడటం జిల్లావ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల “జనం ముచ్చట”లో వచ్చిన వార్తా కథనానికి స్పందిస్తూ తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ (జీఎం) ఇచ్చిన వివరణ.. ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయకపోగా, మరింత గందరగోళానికి తెరతీసింది. అసలు డైరీ మూసివేత వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? దీని వెనుక ఏవైనా కార్పొరేట్ శక్తుల హస్తం ఉందా? అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి.జీఎం వివరణ, క్షేత్రస్థాయి పరిస్థితుల మధ్య పొంతన లేకపోవడంతో ప్రజలు, పాడి రైతుల నుండి ప్రధానంగా కింది సందేహాలు వ్యక్తమవుతున్నాయి….

1975లో ప్రారంభమైన ఖమ్మం విజయా డైరీ ఎన్నో దశాబ్దాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నడుస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల డైరీలతో పోల్చుకుంటే ఖమ్మం డైరీ లాభాల బాటలోనే ప్రయాణిస్తోంది. ఇలాంటి తరుణంలో కేవలం “మరమ్మత్తుల” పేరు చెప్పి మొత్తం డైరీని మూసివేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఖమ్మం డైరీ పరిధిలో సుమారు 12,000 మంది పాడి రైతులు ఉన్నారు. వీరు ప్రతిరోజూ సగటున 18,000 లీటర్ల పాలు (సీజన్‌లో 25,000 లీటర్ల వరకు) కేంద్రాలకు పోస్తున్నారు ఈ తరుణంలో డైరీని మూసివేస్తే నిరంతర పాల సేకరణ సాధ్యపడే పనేనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతే కాకుండా ప్రైవేటు డైరీల దోపిడీకి ఈ రైతులను బలిచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న భయాందోళనలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి….

డైరీ మూసివేత వెనుక ఎలాంటి దురుద్దేశం లేకపోతే, మరమ్మత్తుల కోసం కేవలం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. జిల్లాలో అభివృద్ధి పనుల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న స్థానిక మంత్రులకు, వేలాది మంది రైతులకు ఉపాధి కల్పించే డైరీని కాపాడుకోవడానికి ఈ పాటి నిధులు కేటాయించడం ఒక లెక్కనా? అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.అదే విధంగా ఖమ్మం నగరంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ (Social Welfare Hostels) కు స్థానికంగా పాలు సరఫరా చేయడమే కష్టమవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఏకంగా హైదరాబాద్ నుండి రోజూ సమయానికి పాలు సరఫరా చేస్తామని జీఎం చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఇది ఆచరణ సాధ్యం కాని వ్యవహారం అని సామాన్యులకు కూడా ఇట్టే అర్థమవుతోంది…..

అన్నింటికంటే ముఖ్యమైన ఆరోపణ ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న విజయా డైరీకి చెందిన ఎకరాల కొద్దీ భూములకు మార్కెట్లో వందల కోట్ల రూపాయల విలువ ఉంది.ఈ భూములను రక్షించే విషయంలో కానీ,మరమ్మత్తులు ఎప్పుడు పూర్తవుతాయనే విషయంలో కానీ,తిరిగి డైరీని ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయంలో కానీ జీఎం ఎలాంటి స్పష్టత (Clarity) ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.వందల కోట్ల విలువైన ఈ భూములను కబ్జా చేయడానికి లేదా తమ బినామీలకు కట్టబెట్టడానికి కార్పొరేట్ శక్తులు పావులు కదుపుతున్నాయా? ఈ కార్పొరేట్ శక్తులకు అధికార పార్టీ నాయకుల పూర్తి అండదండలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కావాలనే ఈ యూనిట్‌ను “సిక్ యూనిట్ (నష్టాల సంస్థ)” గా మార్చే కుట్ర జరుగుతోందని విపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.ప్రజల్లో ఇన్ని రకాల బలమైన సందేహాలు, రైతుల కళ్లల్లో ఆందోళన కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ జీఎం ఇచ్చిన మొక్కుబడి వివరణ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఖమ్మం విజయా డైరీ భూములకు రక్షణ కల్పించి, మరమ్మత్తుల కోసం తక్షణమే నిధులు విడుదల చేసి డైరీని పునఃప్రారంభించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదని జిల్లా ప్రజలు హెచ్చరిస్తున్నారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment