తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ,జనం ముచ్చట స్పెషల్ ఫోకస్ : యాభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖమ్మం విజయ పాల డైరీ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పాడి రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకవైపు ప్రకటిస్తుండగానే.. మరోవైపు ఖమ్మం విజయ డైరీని మూసివేసే దిశగా తెరవెనుక ప్రభుత్వ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. లాభాల బాటలో నడుస్తున్న ఖమ్మం డైరీలోని ‘పాల ప్యాకింగ్ ప్లాంటు’ను ఆకస్మాత్తుగా మూసివేసి, వరంగల్ కు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి….

పాత యంత్రాల సాకు.. వరంగల్ పై మోజు….
ఖమ్మం డైరీ ప్యాకింగ్ ప్లాంట్ మూసివేతపై ‘విజయ డైరీ’ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని వివరణ కోరగా.. “ప్యాకింగ్ యంత్రాలు పాతబడిన కారణంగానే ఖమ్మం ప్లాంటును మూసివేస్తున్నామని, ఇకనుంచి వరంగల్ ప్లాంట్ నుంచి ఖమ్మం జిల్లాకు పాల ప్యాకెట్లు సరఫరా చేస్తాం” అని తెలిపారు. కానీ, ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఖమ్మం ప్యాకింగ్ ప్లాంట్ కన్నా, వరంగల్ ప్లాంట్ ఎన్నో ఏళ్లు పాతది. కొత్త యంత్రాలు కొనుగోలు చేసి లాభాల్లో ఉన్న ఖమ్మం ప్లాంట్ ను ఆధునికీకరించాల్సింది పోయి, పాత యంత్రాలు ఉన్న వరంగల్ కు ప్యాకింగ్ ను తరలించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు…..

విద్యార్థులకు పాలు అందేనా? ప్రైవేట్ కు అప్పగించే ప్లానా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లకు ఖమ్మం కేంద్రం నుంచే పాలు అతి కష్టంగా సరఫరా అవుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ నుంచి ప్రతిరోజూ హాస్టళ్లకు పాలు సకాలంలో ఎలా సరఫరా చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ నుంచి పాల ప్యాకెట్లు తెప్పించి సరఫరా చేసే క్రమంలో రవాణా భారం, జాప్యం భరించలేక డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేస్తే.. క్రమంగా ఆ సరఫరా కాంట్రాక్టులను ప్రైవేట్ డైరీలకు కట్టబెట్టే భారీ కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి…..
అసలు కథ భూముల చుట్టేనా?
డైరీ మూసివేత వెనుక ప్రధాన కారణం ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ‘విజయ డైరీ భూములే’ అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.గతంలో పనిచేసిన ఒక ఎమ్మార్వో (MRO) విజయ డైరీ భూములను “ఖాళీగా ఉన్న భూములు” (Vacant Lands) గా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తుగడ ఉందనే విమర్శలు ఉన్నాయి.ఇటీవలే హైదరాబాద్ లాలాగూడలోని ఎంపీఎఫ్ (MPF) కు చెందిన వేల కోట్ల విలువైన 35 ఎకరాల భూమిని ‘అమెజాన్’ సంస్థకు లీజుకు ఇచ్చినట్లు వస్తున్న వార్తలు
ఈ అనుమానాలకు మరింత బలంచేకూరుస్తున్నాయి.
హైదరాబాద్ తరహాలోనే ఖమ్మం డైరీ ఆస్తులను సైతం కార్పొరేట్ సంస్థలకు లేదా రియల్ ఎస్టేట్ బడాబాబులకు కట్టబెట్టేందుకే ప్లాంట్ ను ఖాళీ చేయిస్తున్నారా? అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి…..
ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా చోద్యం చూస్తున్న ప్రభుత్వం…
విజయ డైరీ ఆస్తుల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. భద్రాచలం నడిబొడ్డున ఉన్న సుమారు ఆరు ఎకరాల విజయ డైరీ భూములు ఇప్పటికే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినా.. ప్రభుత్వంగానీ, అధికారులగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు యాభై ఏళ్ల చరిత్ర కలిగిన విజయ డైరీ సంస్థకు చెందిన మిల్క్ ప్రొడక్ట్స్ (పాల ఆధారిత ఉత్పత్తులు) తయారీ వ్యవస్థను జనగామలోని ఓ ప్రైవేట్ ‘శక్తి డైరీ’కి అప్పగించడం చూస్తుంటే.. ప్రభుత్వ రంగ సంస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారనేది స్పష్టమవుతోంది…..
రోడ్డున పడనున్న 12 వేల మంది రైతులు….
విజయ డైరీ మూసివేత కేవలం ఒక ప్లాంట్ కు సంబంధించిన విషయం కాదు. దశాబ్దాలుగా ఈ డైరీని నమ్ముకుని పాల ఉత్పత్తి చేస్తున్న సుమారు 12 వేల మంది రైతుల జీవనోపాధికి సంబంధించిన అంశం. డైరీ ప్యాకింగ్ యూనిట్ ఇక్కడి నుంచి తరలిపోతే, పాల సేకరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే, ఈ డైరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న వందలాది మంది కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.ఇతర జిల్లాల డైరీలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా, లాభాల్లో నడుస్తున్న ఖమ్మం విజయ డైరీని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులపై ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖమ్మం ప్లాంట్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అవసరమైన నిధులు మంజూరు చేసి ఇక్కడే నూతన యంత్రాలను ఏర్పాటు చేయాలని పాడి రైతులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
