మాదకద్రవ్యాల మహమ్మారికి యువత దూరంగా ఉండాలి : ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం (రూరల్): సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు….

ఈ సందర్భంగా ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో, యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీని చేపట్టారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ద్విచక్ర వాహనాల ర్యాలీ ఎదులాపురం క్రాస్ రోడ్డు వరకు ఉత్సాహంగా కొనసాగింది. ప్లకార్డులు చేతబూని, డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులు, యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు…ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువతను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలవాల్సిన యువత క్షణికానందానికి ఆశపడి మాదకద్రవ్యాలకు బానిసలైతే, అది కేవలం వారి వ్యక్తిగత జీవితాలను నాశనం చేయడమే కాకుండా.. యావత్ దేశ భవితవ్యాన్నే ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించారు…..

యువత ఎటువంటి దురలవాట్లకు బానిస కాకుండా సన్మార్గంలో నడిచి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాల బారిన పడితే యువత విద్య, ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపై మాదకద్రవ్యాలు తీవ్ర ప్రభావం చూపుతాయని, ఒకసారి ఈ ఊబిలో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టమని ఆయన వివరించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక యువకులు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment