ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తుమ్మల,వసతులపై అసంతృప్తి!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం సిటీ, జూన్ 25:తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన మంత్రి, అక్కడ అందుతున్న వసతులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు….

మంత్రి తుమ్మల ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను, వారి సహాయకులను పరామర్శించారు. వైద్యులు సకాలంలో అందుబాటులో ఉంటున్నారా? మందులు ఉచితంగా ఇస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఉన్నతాధికారులు, సిబ్బందితో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఔషధాల కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చాలని, ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు….

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ అనంతరం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని వీడివో కాలనీలో పర్యటించారు.SIR (Special Summary Revision) కార్యక్రమంలో భాగంగా అక్కడ జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.బీఎల్ఓలు (BLO), రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న సర్వే తీరును అడిగి తెలుసుకున్న మంత్రి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా, పారదర్శకంగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment