తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ,జూన్ 25: మొహర్రం మాసం త్యాగనిరతికి, ధర్మ పరిరక్షణకు, అపారమైన సహనానికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి, పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పవిత్ర మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మొహర్రం ప్రాముఖ్యతను, మత సామరస్యాన్ని వివరించారు.చరిత్రలో కనీవినీ ఎరుగని త్యాగాలకు మొహర్రం ప్రతీక అని ఆయన అన్నారు. ధర్మ పరిరక్షణ కోసం నాటి కాలంలో ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ సహా పలువురు చేసిన బలిదానాలను, వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈ మొహర్రం సాగుతుందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యం, ధర్మం వైపే నిలబడాలనే గొప్ప సందేశాన్ని కర్బలా మైదానంలో జరిగిన పోరాటం ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన గుర్తుచేశారు…..
సమైక్యతను చాటే పీర్ల ఊరేగింపు…
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొహర్రం (పీర్ల పండుగ)కు ఒక ప్రత్యేకత ఉందని పువ్వాడ స్పష్టం చేశారు. “ఇది కేవలం ఒక మతానికి పరిమితమైన పండుగ కాదు.. ముస్లింలు, హిందువులు ఏకమై అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. గ్రామాలు, పట్టణాల్లో కలిసికట్టుగా నిర్వహించే ‘పీర్ల’ ఊరేగింపు ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను, మన అద్భుతమైన ‘గంగా-జమునా తెహజీబ్’ను కళ్లకు కడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. పీర్ల పండుగ సందర్భంగా జరిగే అగ్నిగుండాలు (దత్తు) దాటడం, షర్బత్ పంపిణీ లాంటి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం తెలంగాణలోని మత సామరస్యానికి ప్రబల నిదర్శనమని కొనియాడారు…
శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలి…..
ఖమ్మం నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఈ పండుగను శాంతియుత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ పవిత్ర మొహర్రం పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, ప్రజల మధ్య ప్రేమానురాగాలు, మత సామరస్యం కలకాలం వర్ధిల్లాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
