తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం జిల్లా, జూన్ 28: ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లా మరోసారి పార్టీలకు రాజకీయ గుమ్మంగా మారింది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ‘రైతు ఆశీర్వాద సభ’ ద్వారా రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉండగా, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు SIR పై అవగాహనా సదస్సుల పేరుతో ఖమ్మం బాట పట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా తారస్థాయికి చేరుకుంది,అదే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30న ఖమ్మంలో భారీ ఎత్తున ‘రైతు ఆశీర్వాద సభ’ను నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది ఈ సభకు రైతులను పెద్ద ఎత్తున తరలించేందుకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.కష్టాల్లో కూడా రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి అండగా నిలబడాలని మంత్రులు కోరుతున్నారు. ఇదే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది….
బీఆర్ఎస్ నేతల విమర్శనాస్త్రాలు….
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఒకరి తర్వాత ఒకరు ఖమ్మంలో పర్యటించి రైతు సమస్యలను ప్రస్తావిస్తూ మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు,కాంగ్రెస్ సర్కార్ రైతులకు దారుణంగా అన్యాయం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు 40 రకాల సన్నాలకు బోనస్ అని చెప్పి, ఇప్పుడు కేవలం 7 రకాలకే పరిమితం చేశారని ఆరోపించారు,’గ్యారెంటీ కార్డుల’ పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని, ఏడాదికి ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షలు ఇస్తామంటూ బాండ్ పేపర్లపై రాసిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ కార్డులను ఇప్పుడు ఎక్కడ పెట్టుకోమంటారని ప్రశ్నించారు….రెండేళ్ల క్రితం ఖమ్మం నగరంలో మున్నేరు ఉప్పొంగి వరదలు వచ్చి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం హెలికాప్టర్ పంపమని జనం వేడుకుంటున్నా మంత్రులు పట్టించుకోలేదని,తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు, ప్రస్తుతం తెలంగాణ మంత్రులు తమ ఆస్తులు పెంచుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. భట్టి విక్రమార్క కమీషన్ల కోసం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూముల కోసం చూస్తున్నారని, మంత్రి తుమ్మల బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల అమ్మకాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు అంతే కాకుండా వరుసగా మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టి సుమారు 29వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మధిర సభలో రైతులు ఎందుకు ఆశీర్వదించాలని నిలదీశారు….
కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకున్నారు కాంగ్రెస్ నేతల కౌంటర్…
బీఆర్ఎస్ నేతల విమర్శలపై కాంగ్రెస్ మంత్రులు ధీటుగా స్పందించారు.BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబంలో కొడుకు, అల్లుడు, కూతురు రాష్ట్రం మీద పడి దోచుకున్నారని,తమకున్న పత్రికలు, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు,పదిసార్లు అబద్ధం చెబితే అదే నిజమైపోతుందనే భ్రమలో వారు బతుకుతున్నారని, ఇలాంటి నాయకులు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం అని కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విపక్షాల విమర్శలను రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు,ఓడిపోయిన పార్టీలు ఏవో చెబుతుంటాయని, కానీ కష్టాల్లో కూడా రైతులను ఆదుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బేరీజు వేసుకొని మద్దతు తెలపాలని ఆయన కోరారు….మొత్తంగా, ఈ నెల 30న ఖమ్మంలో జరగనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారనుంది. బీఆర్ఎస్ సంధించిన ప్రశ్నలకు సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎలా జవాబిస్తుందో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
