న్యూడిల్లీ/తెలంగాణ:
న్యూఢిల్లీ:జూన్ 23:దశాబ్దాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులు, పారిశ్రామికవేత్తలు, భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు’ కల సాకారానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. గతంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క (డిప్యూటీ సీఎం), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడితో కీలక భేటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్త స్థల ప్రతిపాదనలపై చర్చించగా.. రాబోయే 10 రోజుల్లోనే ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలక పరిణామంగా మారింది…..

పాత ప్రతిపాదనలకు బ్రేక్.. కొత్త వ్యూహంతో ముందుకు…..
గతంలో కొత్తగూడెం సమీపంలో గుర్తించిన రెండు స్థలాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కొన్ని సాంకేతిక అడ్డంకులను లేవనెత్తింది.ప్రతిపాదిత స్థలాలకు అత్యంత సమీపంలో విద్యుదీకృత రైల్వే మార్గం ఉండటం, చుట్టూ కొండలు విస్తరించి ఉండటంతో అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల ప్రకారం విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు ఇబ్బందిగా మారుతుందని ఫీజిబిలిటీ అధ్యయనాల్లో తేలింది. దీంతో వెనక్కి తగ్గని రాష్ట్ర ప్రభుత్వం, ఈసారి ఎలాంటి సాంకేతిక లోపాలు లేని ఒక అనుకూలమైన ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించింది. దీనిపై సమగ్ర సాంకేతిక నివేదిక (Detailed Project Report) రూపొందించే బాధ్యతను ఒక ప్రముఖ ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఈ కొత్త ప్రతిపాదనలనే మంత్రుల బృందం కేంద్రానికి సమర్పించింది…..
పది రోజుల్లోనే నివేదిక.. కేంద్ర మంత్రి సానుకూలత….
రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తిపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రాంమోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కొత్తగా ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై కేవలం 10 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన అనుమతుల ప్రక్రియను ‘ఫాస్ట్ ట్రాక్’ పద్ధతిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.భద్రాద్రితో పాటు తెలంగాణలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రంతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కల అయిన మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జులై నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్రమంత్రి అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది…. అంతే కాకుండా ఆదిలాబాద్‌లోని రక్షణ శాఖ (DRDO/IAF) ఆధీనంలో ఉన్న రన్‌వేను సివిల్ ఏవియేషన్ (సాధారణ ప్రయాణికుల) అవసరాలకు వాడుకునేలా రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే అక్కడ కూడా పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు….
‘దక్షిణ అయోధ్య’కు అంతర్జాతీయ గుర్తింపు….
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే భక్తుల రాకపోకలు పెరిగి, భద్రాద్రి గ్లోబల్ టూరిజం మ్యాప్‌లోకి ఎక్కుతుంది. ఎకో-టూరిజం, కిన్నెరసాని వంటి పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. అదే విధంగా భద్రాద్రి జిల్లా పారిశ్రామికంగా ఎంతో కీలకమైనది. సింగరేణి కాలరీస్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, పాల్వంచ కెటిపిఎస్, భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్, బీపీఎల్ వంటి భారీ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. విమాన సౌకర్యం కల్పిస్తే కొత్త పెట్టుబడులు రావడమే కాకుండా, లాజిస్టిక్స్ రంగం ఊపందుకుంటుంది.జిల్లాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఎర్త్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్లు, మైనింగ్ కళాశాలల విద్యార్థులకు, నిపుణులకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది. అత్యవసర వైద్య సేవల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు ఎయిర్ అంబులెన్స్ సేవలు ఉపయోగించుకునే వీలుంటుంది…
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం: మంత్రి తుమ్మల…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూసేకరణ, నిధుల కేటాయింపు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను రికార్డు సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
