తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం సిటీ,జూన్ 23: కంచే చేను మేసిన చందంగా… ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాదారుల అవతారం ఎత్తారు. ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను పేదల ఇళ్ల స్థలాలపై పడింది. ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం, పువ్వాడ ఉదయ్ నగర్లో ఓ మాజీ సర్పంచ్ చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ళ క్రితం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించడమే కాకుండా,కోయచలక రెవెన్యూ పరిధిలోనీ 192 సర్వే నెంబర్లో ఏకంగా 18 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి వందల కోట్లు గడించిన బాగోతం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది….
పేదరాలి గూడుపై మాజీ సర్పంచ్ ప్రతాపం….
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో (2009 వ సంవత్సరంలో) పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా పువ్వాడ ఉదయ్ నగర్‌లోని సర్వే నంబర్ 192లో షేక్.రీజానా బేగం అనే పేద మహిళకు 75 గజాల ఇండ్ల స్థలం (ప్లాట్ నెంబర్ 449) పట్టాగా మంజూరైంది. ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె ఆ స్థలంలోనే ఓ చిన్న రేకుల షెడ్డు వేసుకుని కాలం వెళ్లదీస్తోంది.అయితే, గత ప్రభుత్వ హయాంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో నాటి సర్పంచ్ కన్ను ఈ స్థలంపై పడింది. కన్ను పడిందే తడువుగా అర్ధరాత్రి సమయంలో తన అనుచరులతో కలిసి దౌర్జన్యంగా ఆ రేకుల షెడ్డును తొలగించి, కనికరం లేకుండా ఆ మహిళను రోడ్డున పడేశాడు.
తన ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించిన
ఆ మహిళపై మాజీ సర్పంచ్ దౌర్జన్యానికి దిగాడు. దాడికి యత్నించడమే కాకుండా “నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో.. నన్నెవరు ఏమీ చేయలేరు” అంటూ తీవ్ర స్థాయిలలో బెదిరింపులకు పాల్పడ్డాడు. కట్టుకున్న గూడు కూలిపోయి, నిలువ నీడ లేక ఆ బాధితురాలు ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు….
18 ఎకరాలు స్వాహా… వందల కోట్లు సంపాదన… కళ్లు మూసుకున్న రెవెన్యూ యంత్రాంగం…
ఇది కేవలం 75 గజాల స్థలానికి పరిమితమైన కుంభకోణం కాదు. బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం… సదరు మాజీ సర్పంచ్ మరియు అతని ప్రధాన అనుచరుడైన ప్రస్తుత సర్పంచ్.. ఇద్దరూ కుమ్మక్కై భారీ భూదందాకు తెరలేపారు. సర్వే నెంబర్ 192లో ఉన్న దాదాపు 18 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయించారు. తద్వారా వందల కోట్లు వెనకేసుకున్నారు. ఇంత బహిరంగంగా, యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, వారి మౌనం వెనుక ఉన్న ఆంతర్యంపై స్థానికంగా అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది…..
న్యాయం కోసం నేడు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు….
ప్రస్తుతం తాజా, మాజీ సర్పంచ్ లు ఇద్దరూ ఏకం కావడంతో స్థానికంగా తనకు న్యాయం జరగదని నిర్ధారించుకున్న బాధితురాలు ఎస్కే. రీజానా బేగం ఉన్నతాధికారులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను నేరుగా కలిసి తన గోడును వెళ్లబోసుకోనున్నారు.ఈ సందర్భంగా
“జనం ముచ్చట” తో సదరు మహిళ మాట్లాడుతూ… తన స్థలాన్ని ఆక్రమించిన మాజీ సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం అద్దె ఇళ్లల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తనకు పోలీస్ కమీషనర్ న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడితో ఆగకుండా జిల్లా మంత్రులతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, డీఐజీ, ఐజీ, డీజీపీ, మరియు రాష్ట్ర గవర్నర్‌కు సైతం ఈ భారీ భూకుంభకోణంపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అంతే కాకుండా దాదాపు పద్దెనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేసి వందల కోట్లు సంపాదించడమే కాకుండా పేదల ఇళ్లను లాక్కోనీ రాజకీయ పలుకుబడితో విర్రవీగుతున్న ఇలాంటి ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం సిట్ (SIT) తో గానీ, ఉన్నత స్థాయి కమిటీతో గానీ సమగ్ర విచారణ జరిపించి, కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు….
పత్తి శ్రీనివాస్ జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
