తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం, జూన్ 23:ఖమ్మం నగర పరిధిలోని సర్వే నంబర్ 218లో ప్లాట్లు కొనుగోలు చేసి, అధికారుల చర్యలతో రోడ్డున పడ్డ బాధితులు మంగళవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిశారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో కొనుక్కున్న స్థలాలను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు….

అభివృద్ధి పేరుతో అన్యాయం చేస్తున్నారు….
స్థానికంగా నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా స్కూల్’ కోసం కొన్ని ప్లాట్లను, అలాగే అమరావతి హైవే విస్తరణ పేరుతో మరికొన్ని ప్లాట్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని బాధితులు తెలిపారు. అయితే, ఈ రెండు ప్రాజెక్టులకు ఏమాత్రం అవసరం లేకపోయినా, ఎవరికీ అడ్డం రానటువంటి మిగిలిన 350 ప్లాట్లను కూడా ప్రభుత్వం అకారణంగా, అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని వారు వాపోయారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు….

గుట్టుచప్పుడు కాకుండా బేస్మెట్ల కూల్చివేతలు….
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస సమయం కూడా కేటాయించకుండా.. ప్లాట్లలో తాము నిర్మించుకున్న షెడ్లు, బేస్మెంట్లను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే కూలగొట్టారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. కళ్లెదుటే తమ కలల సౌధం కూలిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయామన్నారు. తమకు ప్రత్యామ్నాయ స్థలాలు లేదా తగిన నష్టపరిహారం ఇప్పించాలని ఇప్పటికే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, జిల్లా కలెక్టర్ ను సైతం కలిసి పదేపదే వేడుకున్నా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని, న్యాయం జరగలేదని పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తెచ్చారు…..

న్యాయపోరాటానికి పువ్వాడ హామీ..
బాధితుల గోడు విన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పేద, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షపూరిత తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు న్యాయపరంగా, రాజకీయంగా ఎంతవరకైనా పోరాడుతామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే అందరికీ ప్రత్యామ్నాయ స్థలాలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని వారికి భరోసా కల్పించారు….
పత్తి శ్రీనివాస్ జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
