వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం.. కార్యకర్తలే బీఆర్ఎస్ బలం: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్!!

Pathi Sreenivas Rao
3 Min Read

వైరా (జూన్ 22):రాజకీయాల్లో వ్యక్తుల కంటే పార్టీ ఎల్లప్పుడూ సుప్రీం అని, క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులు బలంగా ఉన్నప్పుడే అద్భుత విజయాలు సాధించడం సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ (SIR) అవగాహన కార్యక్రమం మరియు సమన్వయకర్తల సమావేశం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సదస్సులో ఆయన పాల్గొని బీఎల్ఓలు (BLO), పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు…..

ఈ సందర్భంగా తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, గులాబీ జెండాను వీడకుండా, కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా నమ్ముకుని నిలబడిన ప్రతి కార్యకర్తకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఉద్వేగంగా అన్నారు. అధికారాలు, పదవులు లేకపోయినా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలే బీఆర్ఎస్‌కు నిజమైన బలం అని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తుండటం వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా జిల్లా పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు.

2004లో తెలంగాణ ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ క్రమశిక్షణను, సిద్ధాంతాలను తాను తుచ తప్పకుండా పాటిస్తున్నానని గుర్తుచేశారు. వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అనుభవజ్ఞులైన నాయకత్వం ఉందని, గతంలో జిల్లా రాజకీయాలను శాసించిన ఉద్దండులు సైతం పార్టీలో ఉన్నారని తెలిపారు. అయితే, నియోజకవర్గంలో తరచూ ఎమ్మెల్యేల మార్పుల వల్ల గ్రామ స్థాయిలో కొంత గందరగోళం నెలకొన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వ్యక్తులను పార్టీ కంటే గొప్పగా భావించే రోజులు పోయాయని, పార్టీ బలంగా ఉన్నప్పుడే ఎవరికైనా గుర్తింపు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో పదవులు ఆశించడం తప్పు కాదని, కానీ పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో ఆ అవకాశాలు వరిస్తాయని ఆయన స్పష్టం చేశారు…..

మండల సమన్వయ కమిటీలు తమ మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి, కలిసికట్టుగా పనిచేయాలని తాతా మధుసూదన్ సూచించారు.పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత సమన్వయ కమిటీలదేనని స్పష్టం చేశారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగినా, రాజకీయ సమీకరణాలు మారినా.. గ్రామ స్థాయిలో పార్టీ పునాదులు గట్టిగా ఉంటే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి కార్యకర్త సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు….ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి రవీందర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేసీ కృష్ణ, నాయకులు లకావత్ గిరిబాబు, కృష్ణ అర్జున్, వైరా నియోజకవర్గ బీఎల్ఓలు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment