ఖమ్మంలో 11 ఏళ్ల బీసీ బాలికపై అఘాయిత్యంపై మీడియా “మౌన రాజకీయం” !!

Pathi Sreenivas Rao
3 Min Read

(“జనం ముచ్చట” ప్రత్యేక వార్తా కథనం)
ఖమ్మం జిల్లా: అభం శుభం తెలియని ఓ పదకొండేళ్ల పసిగందు. దారుణమైన మృగవాంఛకు బలై, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద బీసీ బాలిక. ఖమ్మం నడిబొడ్డున జరిగిన
ఈ దారుణమైన హత్యాచారం, హత్యాయత్నం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసినా… సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, హక్కుల కోసం పోరాడుతామని చెప్పుకునే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మాత్రం అంతుపట్టని మౌన ముద్ర దాల్చాయి. ఈ ‘సెలెక్టివ్’ స్పందనల వెనుక దాగిన ఆంతర్యం ఏమిటి? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పసికందు ప్రాణాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారా అనే అంశంపై ప్రజల్లో అనుమానాలు
రేకేత్తుతున్నాయి….

గతంలో బండి సంజయ్ కుమారుడి కేసుకు సంబంధించి… పగలు, రాత్రి అనే తేడా లేకుండా, నిమిషానికో బ్రేకింగ్ న్యూస్ వేస్తూ, టీఆర్పీల కోసం ఎగబడిన మెయిన్ స్ట్రీమ్ మీడియా, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానెళ్లు ఇప్పుడు ఎటు పోయాయి? ఒక నాయకుడి కొడుకు కేసు మీద చూపించిన అత్యుత్సాహం, ఒక నిరుపేద బీసీ బిడ్డ ప్రాణాల మీదకు వస్తే ఎందుకు చూపించడం లేదు? బండి సంజయ్ కొడుకు కేసు మీద ఒక రీతి… బీసీ బాలిక కేసుపైన ఇంకో రీతినా? కుల, మతాల బేరీజు వేస్తూ వార్తలు వండివార్చడం పత్రికా ధర్మానికే మచ్చ తెస్తున్నాయని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

టీవీ ఛానెళ్ల డిబేట్లలో కూర్చుని, బండి సంజయ్ కొడుకును ఉరి తీయాలని రంకెలు వేసిన వామపక్ష మహిళా సంఘాల నాయకులు ఇప్పుడు ఏ బొరియల్లో దాగారు? ఎక్కడో ఉత్తర భారతదేశంలోనో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనో ఏ చిన్న ఘటన జరిగినా అతిగా స్పందిస్తూ, రోడ్లెక్కి నిరసన ర్యాలీలు, ధర్నాలు చేసే వామపక్ష పార్టీలకు… తమ కళ్లెదుటే, ఖమ్మం నడిబొడ్డున మైనర్ బాలికపై జరిగిన ఇంతటి పైశాచికత్వం ఎందుకు కనిపించడం లేదు? ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలస్తీనాలో బాలల భవిష్యత్తు చిదిమేస్తున్నారని, ఖమ్మంలో పెద్ద ఎత్తున రోడ్లమీద నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించిన ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల తీరు అత్యంత హాస్యాస్పదం. అంతర్జాతీయ స్థాయి మానవ హక్కుల గురించి మాట్లాడే వీరికి, కళ్లెదురుగా నిరుపేద బీసీ బాలికపై జరిగిన దారుణం ఎందుకు కనిపించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు….

ఈ దారుణ ఘటనపై అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నోరు మెదపకపోవడం వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, జరిగిన ఈ ఘోరాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి, నిందితులను రక్షించడానికి పోలీసులపై కొందరు కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఈ వ్యవహారంలో అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.పసికందుపై జరిగిన ఈ అఘాయిత్యం కేవలం ఒక నేరం మాత్రమే కాదు, మన వ్యవస్థలోని ద్వంద్వ వైఖరికి, రాజకీయ పక్షపాతానికి నిలువెత్తు అద్దం. ఓటు బ్యాంకు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వర్గం మీడియా, నాయకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఇప్పటికైనా పౌర సమాజం మేల్కొని, ఆ అభాగ్యురాలికి న్యాయం జరిగేలా, దోషులకు కఠిన శిక్ష పడేలా నినదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు,ప్రజలు భావిస్తున్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment