తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి, ముగ్గురు మంత్రుల ఏలుబడిలో మూడు వర్గాలు,ఆరు కుంపట్లుగా పరిస్థితి తయారైంది.తాజాగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు నూతి సత్యనారాయణకు ఖమ్మం నగర (అర్బన్) అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరికి మధ్య తలెత్తిన ‘ప్రోటోకాల్’ వివాదం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావొస్తున్న ఇప్పటికీ వరకు ఏలాంటి నామినేటెడ్ పదవులు,పార్టీ పదవులు రాక నిరుత్సాహంలో ఉన్న శ్రేణులకు,ఈ ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు మింగుడు పడటం లేదు….
వివాదానికి అసలు కారణం ఏమిటి?
సాధారణంగా జిల్లా కేంద్రంలో జరిగే ఏ కార్యక్రమమైనా జిల్లా అధ్యక్షుని పర్యవేక్షణలో జరుగుతుంటుంది. అయితే, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, పార్టీ మీటింగ్లు మరియు ప్రభుత్వ అధికారిక పర్యటనల్లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని నగర కాంగ్రెస్ విభాగం ఆరోపిస్తోంది.అంతే కాకుండా
నగరంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో ఒకరి ఫోటో ఉంటే మరొకరిది లేకపోవడం, ఒకరి పేరు కంటే మరొకరి పేరు కిందకు ఉండటం వంటి చిన్నపాటి అంశాలే ఇరువురి నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి అదే విధంగా పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు జిల్లాకు వచ్చినప్పుడు వేదికపై ఆసీనులు కావడంలోనూ, ప్రసంగాల క్రమంలోనూ ప్రోటోకాల్ పాటించడం లేదని ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.అంతే కాకుండా జిల్లా కమిటీ తీసుకునే నిర్ణయాలు తమకు తెలియజేయడం లేదని నగర అధ్యక్షుని వర్గం ఆరోపిస్తుండగా ,నగరంలో జరిగే కార్యక్రమాల్లో తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని జిల్లా అధ్యక్షుని వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నాయి….
మంత్రుల అండదండల కోసమేనా?
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు కీలక మంత్రులు (తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతల వద్ద తమ పట్టు నిరూపించుకునే క్రమంలో, జిల్లా మరియు నగర అధ్యక్షుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరికి వారు తామే అసలైన ‘బాస్’ అని నిరూపించుకునే ప్రయత్నంలో ఈ ప్రోటోకాల్ గొడవలు తెరపైకి వస్తున్నాయి.ఈ క్రమంలో అగ్ర నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరి కార్యక్రమానికి వెళ్లాలి? ఎవరి ఫోటోలు వాడాలి? అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి…..
అధిష్టానం జోక్యం అవసరమా?
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి, నగర కాంగ్రెస్ అధ్యక్షునికి మధ్య ప్రోటోకాల్ వివాదం ముదిరి పాకాన పడకముందే జిల్లా మంత్రులు,జిల్లా ఇన్-చార్జ్ మంత్రులు జోక్యం చేసుకుని ఇరువురిని సమన్వయ పరచాల్సిన అవసరం ఉంది. “పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదు” అనే సంకేతాన్ని పంపకపోతే, ప్రత్యర్థి పార్టీలకు ఇది ఆయుధంగా మారే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏతా వాతా ఖమ్మం కాంగ్రెస్‌లో ఈ ‘ప్రోటోకాల్’ పంచాయితీ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. సమన్వయంతో సాగాల్సిన నేతలు.. ఆధిపత్యం కోసం ఆరాటపడితే నష్టం పార్టీకేనని సీనియర్లు హెచ్చరిస్తున్నారు……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
